అవకాశాలకు జీఈఎస్‌

30 Nov, 2017 02:00 IST|Sakshi
హెచ్‌ఐసీసీ వద్ద జీఈఎస్‌ 2017 లోగో ముందు ఉత్సాహంగా ఫొటోలకు పోజులిస్తున్న విదేశీ ప్రతినిధులు

హైదరాబాద్‌ సదస్సుపై ఇన్వెస్టర్లు,పారిశ్రామికవేత్తల ఆశాభావం

వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్ల ఆసక్తి

పలు స్టార్టప్‌ సంస్థలతో సంప్రదింపులు

తగిన అవకాశాలు దొరికాయన్న పారిశ్రామికవేత్తలు

పెట్టుబడుల కోసం కొనసాగుతున్న చర్చలు

ఇరు వర్గాలకు వేదిక.. ‘నెట్‌ వర్కింగ్‌’పైనా ఫోకస్‌

ఇదే ఈ సదస్సు ఉద్దేశమన్న నీతి ఆయోగ్‌

స్టార్టప్‌లకు మార్గదర్శకత్వానికి మరిన్ని కార్యక్రమాలు: అమెరికా

(రమణమూర్తి మంథా)
అవును! ఇక్కడ పెట్టుబడులకు తగిన అవకాశాలు ఉంటాయేమోనని వచ్చాం. తగిన సామర్థ్యమున్న పారిశ్రామికవేత్తలను చూశాం. కొందరితో మాట్లాడుతున్నాం. వాతావరణమైతే బాగుంది..
– ఇది పెట్టుబడిదారుల మాట.
మా ఆలోచనలను కంపెనీలుగా మార్చాం. మాకు ఎదగటానికి మరిన్ని నిధులు, కాస్త మద్దతు కావాలి. ఇక్కడికొచ్చి ఇతర సంస్థలను చూసి, ఇన్వెస్టర్లతో మా ఆలోచనలు పంచుకున్నాక ఆశలు పెరిగాయి.. – ఇది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మాట
...ఈ రెండు వర్గాలను ఒకచోటికి చేర్చడానికే ఈ వేదికను సృష్టించామని, ఇది మున్ముందు దేశంలో పారిశ్రామికవేత్తల సంఖ్యను భారీగా పెంచి, మరింత మందికి ఉపాధినిచ్చే దిశగా వెళుతుందనేది నిర్వాహకుల మాట. మొత్తంగా హైదరాబాద్‌లో జరుగుతున్న జీఈఎస్‌–2017పై అటు నిర్వాహకులు, ఇటు డెలిగేట్లు అందరూ సంతృప్తితో కూడిన ఆశలనే వ్యక్తం చేశారు.

నిజానికి జీఈఎస్‌ సదస్సు ఏ లక్ష కోట్లో, వేల కోట్లో పెట్టుబడులను కుమ్మరిస్తున్నట్లుగా బడా కంపెనీలు ప్రకటించేసి.. ఎంఓయూలు కుదుర్చుకుని మరిచిపోయే ఫక్తు వ్యాపార సదస్సు కాదు. పెద్ద పెద్ద పరిశ్రమలేవీ ఈ వేదికపై భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించే అవకాశమూ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా స్టార్టప్‌ల వ్యవహారం. కొత్త ఆలోచనలతో సంస్థలు ప్రారంభించి, తగిన మార్గదర్శకత్వం కోసం, అవసరమైన నిధుల కోసం చూస్తున్న స్టార్టప్‌లకు తగిన వనరులు వెతుక్కునే వేదిక ఇది. భారీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలతో పాటు చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టే వ్యక్తిగత ఇన్వెస్టర్లూ ఇందులో పాల్గొన్నారు. వచ్చినందుకు ప్రయోజనం దక్కుతోందని ఆశాభావమూ వ్యక్తం చేస్తున్నారు. ‘‘నేను మా దేశంలో రియల్‌ ఎస్టేట్‌లో, మైక్రోఫైనాన్స్‌లో పెట్టుబడులు పెట్టా. అమెరికాలోనూ కొంత పెట్టుబడులు పెట్టా. ఇక్కడ పారిశ్రామిక వాతావరణం ఎలా ఉంటుందో, కొత్త ఆవిష్కరణలు ఏం వస్తున్నాయో, ఏ రంగాలైతే మంచివో చూడటానికి వచ్చా. నా శ్రమ వృథా పోలేదు. చాలా మందిని కలుసుకున్నా.. చాలా తెలుసుకున్నా..’’ అని కంబోడియా మహిళ నందా పోక్‌ ‘సాక్షి’తో పేర్కొనడం గమనార్హం. తమ దేశంలో మంచి నాణ్యమైన మిరియాలు పండుతాయని, వాటిని దిగుమతి చేసుకోవటానికి కొందరు తనతో మాట్లాడారని.. ఆ చర్చలు కొనసాగుతున్నాయని ఆమె చెప్పారు. ఈమె కంబోడియా విమెన్‌ బిజినెస్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు కూడా.

వాతావరణం బాగుందన్న ఇన్వెస్టర్లు
నిజానికి ఏ పరిశ్రమకైనా పెట్టుబడులే కీలకం. ఈ సదస్సులో ‘ఓవర్సీస్‌ ప్రైవేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌’తో పాటు టీవీఎస్‌ క్యాపిటల్, వెంచర్‌ ఈస్ట్, కలారి క్యాపిటల్, కార్లైల్‌ ఇండియా అడ్వయిజర్స్, లెట్స్‌ వెంచర్, ఐవీక్యాప్‌ వెంచర్స్, విలేజ్‌ క్యాపిటల్, ఎండియా పార్ట్‌నర్స్, స్పార్క్‌రైజ్‌.. ఇలా పెద్ద సంఖ్యలో ఇన్వెస్ట్‌మెంట్, క్రౌడ్‌ ఫండింగ్‌ కంపెనీలు పాల్గొన్నాయి. వివిధ దేశాల నుంచి చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలు, వ్యక్తిగత ఇన్వెస్టర్లు కూడా పాల్గొన్నారు. ‘‘మాకైతే ఇప్పుడు పెట్టుబడులు పెట్టే ఉద్దేశం లేదు. కానీ ఇక్కడి వాతావరణాన్ని చూడటానికి, కొన్ని నెట్‌వర్కింగ్‌ పరిచయాల కోసం వచ్చాం. ఫండింగ్‌ కోసం చాలా మంది నాకు ఫోన్లు చేశారు. వారు మిగతా వారితో కూడా మాట్లాడుతున్నట్లు చెప్పారు. మొత్తంగా చూస్తే ఇక్కడ ఆశావహ వాతావరణమే ఉంది..’’ అని వెంచర్‌ ఈస్ట్‌ క్యాపిటల్‌కు చెందిన సనా అన్సారీ చెప్పారు.

అంచనాలు తగ్గట్లే ఉందన్న పారిశ్రామికవేత్తలు
సదస్సుకు ఇక్కడి సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌ యజమానులు హాజరయ్యారు. తమ చుట్టుపక్కల ఉన్న అవకాశాలనూ వారు ఈ వేదికపై తెలుసుకోగలిగారు. మునగ రైతులతో కలసి పనిచేసే బెలీజ్‌ దేశ సంస్థ మెరింగా బెలీజ్‌ది ఇలాంటి కథే. మునగాకు, విత్తనాలు విక్రయించే ఈ సంస్థ ఐదు వేల బెలీజ్‌ డాలర్లతో మొదలై ప్రభుత్వ ఫండింగ్‌తో యంత్రాలు కొని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. ‘‘జీఈఎస్‌లో మెంటార్స్‌ను, విదేశీ ప్రతినిధులను కలిసే అవకాశం దక్కింది. మునగ ఉత్పత్తులకు డిమాండ్‌ ఎక్కువగా ఉండే బ్రిటన్‌ వాసులతో పరిచయాలు కలిగాయి. త్వరలోనే బ్రిటన్‌కి కూడా ఎగుమతులు ప్రారంభిస్తాం. ఆ రకంగా జీఈఎస్‌తో నేను హ్యాపీ..’’ అని మెరింగా బెలీజ్‌ వ్యవస్థాపకురాలు ఆండ్రియా చెప్పారు. అమెరికాలో ఇన్వెస్టర్లు, ఎంట్రప్రెన్యూర్స్‌ని ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రారంభమైన బ్లాక్‌ గర్ల్‌ వెంచర్స్‌ సంస్థ కూడా జీఈఎస్‌ సదస్సు ద్వారా ఇన్వెస్టర్లు పరిచయమయ్యారని, నిధులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

మరిన్ని కార్యక్రమాలు కూడా..
స్టార్టప్‌లు ఎదగటానికి తగిన ‘అనుకూల వ్యవస్థ’ను సృష్టించాలన్న లక్ష్యానికి జీఈఎస్‌ సదస్సు ఉపయోగపడుతోందని అటు నీతీ ఆయోగ్, ఇటు అమెరికా ప్రభుత్వం అభిప్రాయపడ్డాయి. ‘‘తగిన అనుకూల వ్యవస్థ ఇక్కడ ఉంది. అది అద్భుతంగా పనిచేస్తోంది. కొన్ని సమస్యలున్నా వాటిని పరిష్కరించటానికి నిరంతరం మా కాన్సులేట్లతో కలసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తాం..’’ అని అమెరికా యువజన వ్యవహారాల గ్లోబల్‌ అడ్వైజర్‌ ఆండీ రబెన్స్‌ అభిప్రాయపడ్డారు. ఇక ‘‘పారిశ్రామికవేత్తలుగా ఎదగాలంటే చదువుకునే దశ నుంచీ కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తి ఉండాలి. అందుకే నీతి ఆయోగ్‌ ఆధ్వరంలో అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ ద్వారా స్కూళ్లు, యూనివర్సిటీల్లో ల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. స్టార్టప్‌ల మధ్య ఛాలెంజ్‌లు నిర్వహించి సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకు భారీ బహుమతులిస్తున్నాం. ఇది ఇంకా ముందుకెళుతుంది..’’ అని నీతి ఆయోగ్‌ అదనపు కార్యదర్శి ఆర్‌.రమణన్‌ చెప్పారు. ఈ వేదిక కల్పించిన అవకాశాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయన్నది వ్యక్తుల సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటుందనే విషయంలో మాత్రం ఇద్దరిదీ ఏకాభిప్రాయమే.

కొంత పెట్టుబడులు రావచ్చు : షెల్లీ బెల్, బ్లాక్‌ గర్ల్‌ వెంచర్స్, అమెరికా
‘‘బ్లాక్‌గర్ల్‌ వెంచర్స్‌తో ఇటు పెట్టుబడిదారులు, అటు ఎంట్రప్రెన్యూర్స్‌ని ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రధానంగా నల్లజాతి మహిళా ఎంట్రప్రెన్యూర్స్‌ తమ ఐడియాలను బాస్‌ అప్‌ పేరిట నిర్వహించే పిచ్‌ కాంపిటీషన్‌లో బీజీవీ సభ్యుల ముందుంచుతారు. కమ్యూనిటీ ఓటింగ్‌లో విజేతలైన వారికి వ్యాపారాన్ని ప్రారంభించుకునేందుకు సీడ్‌ ఫండింగ్‌తో పాటు అకౌంటింగ్, లీగల్‌ కన్సల్టేషన్‌ మొదలైన వాటిపరంగా కూడా తోడ్పాటు లభిస్తుంది. ఇదీ మా సంస్థ నేపథ్యం. మా కార్యకలాపాలు విస్తరించే క్రమంలో విదేశీ ఎంట్రప్రెన్యూర్లు, ఇన్వెస్టర్లతో నెట్‌వర్కింగ్‌ అవకాశాలు లభిస్తాయని ఈ జీఈఎస్‌కు వచ్చా. మా సంస్థ సీడ్‌ ఫండింగ్‌ స్థాయిలో ఉంది. ఆశించిన ప్రయోజనాలు కొంత కనిపించాయి. కొందరు ఇన్వెస్టర్లతో పరిచయమైంది. పెట్టుబడులు రాగలవని ఆశిస్తున్నా..’’

ఇన్వెస్టర్లను కలిసే అవకాశం వచ్చింది : నిషిత మన్నె, సీఈవో, వీవ్స్‌మార్ట్‌
‘‘మేం ప్రధానంగా చేనేతకారులకు డిజిటల్‌ ప్లాట్‌ఫాం కల్పిస్తున్నాం. వారికి ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సదుపాయం కల్పించే దిశగా వీవ్స్‌మార్ట్‌ పోర్టల్‌ని ఏర్పాటు చేశాం. దేశవ్యాప్తంగా 4,000 మంది పైచిలుకు వీవర్స్‌తో చేతులు కలిపాం. వీరిలో సుమారు 1,500 మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. మూడేళ్ల క్రితం మా సొంత నిధులతోనే ప్రారంభించాం. ప్రభుత్వం కూడా మా సేవలను గుర్తించి ప్రోత్సహిస్తోంది. జీఈఎస్‌లో ప్రధానంగా ఇతర ఇన్వెస్టర్లు, ఎంట్రప్రెన్యూర్లతో పరిచయాలు లభిస్తాయనే ఉద్దేశంతో హాజరయ్యాను. అనుకున్నట్లే కొందరితో కలిసే అవకాశం లభించింది..’’

కొత్త అవకాశాలను చూస్తున్నాం : బిభూటి న్యూపాన్, అంతర్‌పేరన (నేపాల్‌)
‘‘నేపాల్‌లో మేం దాదాపు 10 సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేశాం. భారత్‌లో ఇంకా నేరుగా పెట్టుబడులు పెట్టలేదు. కానీ వేరే సంస్థలతో కలసి కొన్ని పెట్టుబడులున్నాయి. ఇక్కడ ఎలాంటి అవకాశాలున్నాయో తెలుసుకోవటానికి సదస్సు ఉపకరిస్తుందని భావించి వచ్చా. వచ్చినందుకు చాలా అవకాశాలు కనిపించాయి. ఇక రాబోయేది ఆవిష్కరణల శకం. కొత్త ఆవిష్కరణలతో వచ్చే సంస్థల హవా కొనసాగుతుంది. పెట్టుబడులు అవసరమైన ముగ్గురు పారిశ్రామికవేత్తలు నాతో మాట్లాడారు. కాకపోతే పెట్టుబడి అనేది ఒకరోజులో అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం కాదు. అన్నీ పరిశీలించాల్సి ఉంది..’’

‘ఏఐ’ సంస్థలపై దృష్టి పెట్టాం : సారా విట్‌లీబ్, మ్యునిక్‌ ఎయిర్‌పోర్టు సంస్థ
‘‘మేం ప్రధానంగా ఎయిర్‌పోర్ట్, ఏవియేషన్‌ రంగాల్లోనే పెట్టుబడులు పెడుతున్నాం. అలాంటి అవకాశాల కోసం ఇక్కడకు వచ్చాం. అయితే ఇక్కడ కొత్త టెక్నాలజీలను చూశాం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి రంగాలకు చెందిన నాలుగైదు సంస్థల ప్రతినిధులు మాతో మాట్లాడారు. ఇంకా అవకాశాలను పరిశీలిస్తున్నాం. వీటన్నిటినీ తదుపరి దశలకు తీసుకెళ్లటానికి చర్చలు కొనసాగిస్తాం..’’

నవభారత నిర్మాణం దిశగా ప్రభుత్వం కృషి : నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌
సాక్షి, హైదరాబాద్‌: పేదరికం, అవినీతి, ఉగ్రవాదం, కులం, మతతత్వ ప్రభావం లేని నవభారతాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో బుధవారం జరిగిన ‘న్యూ ఇండియా ఎట్‌ ది రేట్‌ ఆఫ్‌ 2022’కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర య్యారు. 92వ ఫౌండేషన్‌ కోర్సు శిక్షణలో ఉన్న అఖిల భారత సర్వీస్, కేంద్ర సర్వీసు లకు చెందిన అధికారు లనుద్ధేశించి ఆయన మాట్లాడా రు. అభివృద్ధి పథంలో దేశాన్ని ఉన్నత శిఖరాల్లో నిలిపేందుకు సివిల్‌ సర్వెంట్లు ముందుం డాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు