బంగారం, స్థిరాస్తులే విలువైన ఆస్తులు!

14 Dec, 2017 01:08 IST|Sakshi

 వ్యక్తిగత ఆస్తుల్లో 91% వాటా వీటిదే

కార్వీ ‘వెల్త్‌ రిపోర్ట్‌’లో వెల్లడి 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బంగారం, స్థిరాస్తులంటే భారతీయులకు ఇప్పటికీ మోజే. అందుకే కాబోలు భౌతిక ఆస్తుల సంపదలో వీటి వాటా ఏకంగా 91 శాతం పైమాటేనట!! ఈ మాట చెప్పింది వేరెవరో కాదు. ఫైనాన్షియల్‌ సేవల దిగ్గజం కార్వీ. ఈ సంస్థ ‘ఇండియా వెల్త్‌ రిపోర్ట్‌’ పేరిట 8వ నివేదికను విడుదల చేసింది. దీన్లో... భారతీయుల భౌతిక ఆస్తుల్లో వ్యక్తిగత సంపద రూ.140 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడయింది. దీన్లో బంగారం రూపంలో ఉన్నది ఏకంగా రూ.68.45 లక్షల కోట్లు.

ఇది మొత్తం భౌతిక ఆస్తుల్లో దాదాపు సగం. ఇక రియల్టీ రంగంలో వ్యక్తిగత ఆస్తుల సంపద రూ.60.25 లక్షల కోట్లుగా ఉంది. అంటే... ఒకరకంగా చెప్పాలంటే రియల్టీకన్నా బంగారంలోనే వ్యక్తిగత సంపద ఎక్కువగా ఉందన్న మాట. వచ్చే ఐదేళ్ల కాలంలో భౌతిక ఆస్తుల సంపదలో రియల్టీ రూ.121 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో కార్వీ ఇండియా సీఈఓ అభిజిత్‌ భావే తెలియజేశారు. ప్రస్తుతం 43 శాతంగా ఉన్న రియల్టీ రంగం వృద్ధి 2022 నాటికి  51.57 శాతానికి చేరుతుందని ఆయన అంచనా వేశారు. పెద్ద నోట్ల రద్దు, స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వల్ల దేశీయ రియల్టీ రంగంలో నెలకొన్న పారదర్శకతే వృద్ధి చోదకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.


   

మరిన్ని వార్తలు