ఐటీ కంపెనీల లాభాలపై ఒత్తిడి..

4 Aug, 2016 01:34 IST|Sakshi
ఐటీ కంపెనీల లాభాలపై ఒత్తిడి..

తగ్గనున్న నియామకాలు
నాస్కాం ప్రెసిడెంట్ చంద్రశేఖర్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయ ఐటీ కంపెనీల లాభాలపై ఈ ఏడాది ఒత్తిడి ఉంటుందని నాస్కాం చెబుతోంది. నియామకాలూ తగ్గుతాయని నాస్కాం ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ బుధవారమిక్కడ వెల్లడించారు. ఈ పరిస్థితులు ప్రస్తుత ఏడాది ప్రస్ఫుటంగా కనపడతాయని అన్నారు. ‘అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం ఉంది. యూరప్‌లో వృద్ధి రేటు చాలా తక్కువగా ఉంది. ప్రధానంగా దక్షిణ యూరప్‌లో తిరోగమన వృద్ధి నమోదైంది. బ్రెగ్జిట్ నేపథ్యంలో పౌండ్ విలువ తగ్గింది. పౌండ్ల రూపంలో కాంట్రాక్టులను కుదుర్చుకున్న ఐటీ కంపెనీల మార్జిన్లపై ప్రభావం ఉండే అవకాశం ఉంది’ అని వెల్లడించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.

 ఆటోమేషన్‌తో...
ఐటీ కంపెనీల్లో నియామకాలు స్వల్పంగా తగ్గుతాయని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆటోమేషన్ విస్తృతం కావడంతోపాటు ఉద్యోగుల సామర్థ్యం పెరగడమే ఇందుకు కారణమని అన్నారు. దేశంలో ఐటీ, ఐటీఈఎస్ పరిశ్రమ 100 బిలియన్ డాలర్లకు చేరుకున్నప్పుడు మొత్తం 30 లక్షల మందికి ఉపాధి అవకాశాలను తెచ్చిపెట్టింది. మరో 100 బిలియన్ డాలర్లు జతకూడేందుకు కొత్తగా 15 లక్షల మంది అవసరమవుతారని అంచనాలు ఉన్నాయన్నారు.

మరిన్ని వార్తలు