‘స్ట్రెస్‌’ నుంచి బయట పడేందుకు ఎలాన్‌ మస్క్‌ చేసే పని ఇదా!

12 Nov, 2023 11:21 IST|Sakshi

ఒత్తిడి! పోటీ ప్రపంచంలో సర్వసాధారణం అయ్యింది. ఈ స్ట్రెస్‌ నుంచి రిలాక్స్‌ అయ్యేందుకు సినిమాలు చూడడం, క్రికెట్‌ ఆడుతుంటారు. దిగ్గజ కంపెనీల సీఈఓలు రోజూ వారి ఒత్తిడిల నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేస్తుంటారు. గోల్ఫ్‌ లేదంటే, సెయిలింగ్‌ క్లబ్బులకు వెళుతుంటారు. మరి ఎలాన్‌ మస్క్‌ ఏం చేస్తారని మీకెప్పుడైనా తెలుసుకోవాలని అనిపించిందా? 

ప్రంపచంలో అపరకుబేరుడు, పదుల సంఖ్యలో కంపెనీలకు అధినేత ఎలాన్‌ మస్క్‌ ఒత్తిడిని పోగొట్టుకునేందుకు ఏం చేస్తుంటారో ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. 
మస్క్‌ ఒత్తిడిలో ఉన్నప్పుడు వీడియో గేమ్స్‌ ఎక్కువగా ఆడుతానని చెప్పారు. పరిమితులు లేని నా ఆలోచనల్లోని అల్లకల్లోలాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని అన్నారు.  

అమెరికన్‌ కంప్యూటర్‌ సైంటిస్ట్‌, పాడ్‌కాస్టర్‌ లెక్స్ ఫ్రిడ్మాన్‌ పాడ్‌ కాస్ట్‌లో మస్క్‌ మాట్లాడుతూ.. నా మెదడు తుఫాను లాంటింది. ఒకేసారి పదిపనులు చేయాల్సినప్పుడు నా మైండ్‌ నా కంట్రోల్‌లో ఉండదు. నా గురించి తెలియని వారు నాలా ఉండాలని, లేదంటే పనిచేయాలని అనుకుంటారు. కానీ అది సాధ్యం కాదని చెప్పారు. 

ఇదే విషయాన్ని ఆయన (మస్క్‌)తో కలిసి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన గ్రైమ్స్‌..ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ మాజీ సీఈవో వాల్టర్‌ ఐజాక్సన్‌ ఎలాన్‌ మస్క్‌ జీవితం గురించి రాసిన ‘ఎలాన్‌ మస్క్‌’ ఆటో బయోగ్రఫీ బుక్‌లో చెప్పారు. మస్క్‌ ఎక్కువగా ఆడే వీడియో గేమ్‌లలో ‘ది బ్యాటిల్‌ ఆఫ్‌ పాలిటోపియా’, ‘ఎల్డెన్‌ రింగ్‌’లు ఉన్నాయి.

‘ది బ్యాటిల్‌ ఆఫ్‌ పాలిటోపియా’ నాగరికతను నిర్మించడం, యుద్ధానికి వెళ్లడం గురించిన వ్యూహాత్మక గేమ్ కాగా.. ఒక సీఈఓకు కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఈ గేమ్‌ ఉపయోగపడుతుందని మస్క్‌ భావిస్తారని పేర్కొన్నారు.

మరో వీడియో గేమ్‌ ‘ఎల్డెన్‌ రింగ్‌’. యుద్ధంపై దృష్టి సారించడం, రాజ్యాన్ని నిర్మించడమే ఈ గేమ్‌ లక్ష్యమని పాడ్‌కాస్ట్‌లో వివరించారు. తన మెదడును ఒక నిర్దిష్ట స్థితికి తీసుకెళ్లడానికి వీడియో గేమ్స్‌ ఉపయోగపడతాయి. గేమ్‌లో ముందుకు వెళుతున్న కొద్దీ పురోగతి సాధిస్తున్న ఫీలింగ్‌ కలుగుతుందని ఎలాన్‌ మస్క్‌ పాడ్‌ కాస్ట్‌లో వివరించారు.

మరిన్ని వార్తలు