భారత మార్కెట్లోకి వెన్యూ! 

22 May, 2019 00:17 IST|Sakshi

హుందాయ్‌ నుంచి మరో ఎస్‌యూవీ కాంపాక్ట్‌

పెట్రోల్, డీజిల్‌ వేరియంట్లు; ధర రూ. 6.5–11.1 లక్షలు

సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం హుందాయ్‌... అధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ కాంపాక్ట్‌ సెగ్మెంట్లో తన కొత్త మోడల్‌  ‘వెన్యూ’ను మంగళవారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఢిల్లీలో దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.6.5–11.1 లక్షల మధ్య ఉంది. 1 లీటర్‌ టర్బో, 1.2 లీటర్ల పెట్రోల్‌తో పాటు 1.4 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌లతో మూడు ఆప్షన్లలో ఇది లభిస్తుంది. ఎస్‌యూవీ కాంపాక్ట్‌ సెగ్మెంట్‌లలో పోటీ పడుతున్న హుందాయ్‌ క్రెటా కన్నా ధరలో  తక్కువ కావటం గమనార్హం. పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.6.5– 11.1 లక్షలుగా, డీజిల్‌ వేరియంట్‌ ధర రూ. 7.75– 10.84 లక్షలుగా (ఎక్స్‌ షోరూం, ఢిల్లీ) ఉంది. రూ.6.48– 11.99 లక్షల రేంజ్‌లోనే ఉన్న  మారుతీ విటారా బ్రెజా, టాటా మోటర్స్‌ నెక్సాన్, పోర్డ్‌ ఎకోస్పోర్ట్, మహింద్రా ఎక్స్‌యూవీ 300లకు ఇది గట్టి పోటీనిస్తుందనేది మార్కెట్‌ వర్గాల మాట. 

‘‘మా అంతర్జాతీయ వ్యాపార వృద్ధిలో భారత్‌ కీలకం. ఈ మార్కెట్‌పై మాకున్న నిబద్ధతను వెన్యూ బలపర్చింది’’ అని హుందాయ్‌ ఎమ్‌డీ, సీఈఓ ఎస్‌ ఎస్‌ కిమ్‌ చెప్పారు. ఈ మోడల్‌ కోసం నాలుగేళ్లల్లో రూ. 690 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు చెప్పారాయన. భారత మార్కెట్‌ కోసం పానిక్‌ బటన్‌ వంటి కొన్ని రకాల ఫీచర్లు దీనిలో ప్రవేశపెట్టారు. ఎలక్ట్రిక్‌ సన్‌ రూఫ్, వైర్‌లెస్‌ ఫోన్‌ చార్జింగ్, ఎయిర్‌ ప్యూరీఫయర్, క్రూజ్‌ కంట్రోల్‌తో పాటు ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, స్పీడ్‌ సెన్సింగ్‌ ఆటో డోర్‌ లాక్, వెహికల్‌ స్టెబిలిటీ మేనెజ్‌మెంట్‌ వంటి భద్రతాపరమైన ఫీచర్లు ఉన్నాయి.   

>
మరిన్ని వార్తలు