భారత్‌లో ఫోర్డ్‌ మరో సంచలన నిర్ణయం!

20 Dec, 2023 17:03 IST|Sakshi

అమెరికన్‌ కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తన ఫోర్డ్‌ కార్ల తయారీని నిలిపివేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఫోర్డ్‌ యాజమాన్యం ఫోర్డ్‌ చెన్నై ప్లాంట్‌ను ఉక్కు దిగ్గజం జే.ఎస్.డబ్ల్యూ స్టీల్‌కి అమ్మాలనుకున్న నిర్ణయాన్ని విరమించుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

భారతీయలు నాడి పసిగట్టలేక
ఆర్థిక సంస్కరణలు మొదలైన 1991 తరువాత భారత్‌కు వచ్చిన తొలి అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సంస్థల్లో ఫోర్డ్‌ ఒకటి. వందల కోట్లు ఇక్కడ పెట్టుబడిగా పెట్టి, ఇక్కడే కార్ల తయారీ, అమ్మకాలు చేపట్టింది. అయితే, భారతీయుల నాడిని పసిగట్టడంలో విఫలమైంది. అప్పట్లో భారతీయులకు చిన్న కార్లపై మోజు ఎక్కువగా ఉండేది. ఫోర్డ్‌ దాన్ని క్యాష్‌ చేసుకోలేకపోయింది.  చిన్న కార్లను పరిమిత సంఖ్యలో అమ్మేది. అదే సమయంలో మారుతి, హ్యుండయ్‌లతో పోటీ పడలేదకపోయింది.

చేతులు కాల్చుకోవడం ఇష్టం లేకే
ఫలితంగా ఫోర్డ్‌ మన మార్కెట్‌లో 2 శాతం కన్నా తక్కువ వాటానే సాధించగలిగింది. 2000 నుంచి 2021 వరకు 200 కోట్ల డాలర్ల మేర నష్టమూటగట్టుకుంది. 2020 నాటికి దేశంలో 50 లక్షల మేర ప్రయాణికుల కార్ల అమ్మకాలుంటాయని అంచనా వేస్తే, 30 లక్షలలోపునకే పరిమితమైంది. ఇంకా చేతులు కాల్చుకోవడం అర్థం లేదని 2021లో  భారత్‌లో తన కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 

ఫోర్డ్‌కు రెండు ప్లాంట్‌లు 
ఈ నేపథ్యంలో.. ఫోర్డ్‌కు భారత్‌లో రెండు కార్ల తయారీ ప్లాంట్‌లు ఉన్నాయి. ఒకటి గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలోని సనంద్‌లో ఉండగా, మరొకటి తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉంది. సుమారు 350 ఎకరాల్లో వాహన అసెంబ్లీ ప్లాంటు, 110 ఎకరాల్లో ఇంజిన్ల తయారు చేసేది. ఫోర్డ్‌ భారత మార్కెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి..సనంద్‌ ప్లాంట్‌ను టాటా కంపెనీకి అమ్మింది. 

చెన్నై ప్లాంట్‌ను జే.ఎస్.డబ్ల్యూ స్టీల్‌కి అమ్మేలా
చెన్నైలో ఉన్న రెండో ప్లాంట్‌ను అమ్మేందుకు మహీంద్రా అండ్‌ మహీంద్రాను, తైవాన్‌ ఎలక్ట్రానిక్‌ జెయింట్‌ విన్‌ఫాస్ట్‌ను సంప్రదించింది. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. చివరకు ఫోర్డ్‌ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థకు జే.ఎస్.డబ్ల్యూ మధ్య కొనుగోలు, అమ్మకాలు ఒప్పందాలు జరిగాయి. 

చివరికి ట్విస్ట్‌ ఇచ్చి
చెన్నై ప్లాంట్‌ను జే.ఎస్‌,డబ్ల్యూకి అమ్మే డీల్‌ చివరి దశకు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని విరమించుకుందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేశాయి. భారత్‌లో చెన్నైతో పాటు, పలు ప్రాంతాల్లో ఉద్యోగుల్ని నియమించుకుని తిరిగి కార్లను తయారు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అటు ఫోర్డ్‌ కానీ, ఇటు జే.ఎస్‌.డబ్ల్యూ కానీ స్పందించలేదు. 

>
మరిన్ని వార్తలు