ఆశ్చర్యం నుంచి అర్ధాంతరంగా..

25 Oct, 2016 09:04 IST|Sakshi
రేసులో ఇంద్రానూయి, ఎన్ చంద్రశేఖరన్, నోయెల్ టాటా

ముంబై: టాటా గ్రూపు చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తప్పించడంతో ఖాళీ కానున్న పదవికి తగిన సమర్థులు ఎవరు? అన్న ఆసక్తికరమైన ప్రశ్నపై ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అయితే, పెప్సీకో సీఈవో ఇంద్రానూయి, వొడాఫోన్ మాజీ సీఈవో అరుణ్‌శరీన్, నోయెల్ టాటా, టీసీఎస్ సీఈవో, ఎండీ ఎన్ చంద్రశేఖరన్, టాటా గ్రూపునకే చెందిన ఇషాంత్ హుస్సేన్, బి.ముత్తురామన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. టాటా గ్రూపు కంపెనీల హోల్డింగ్ సంస్థ టాటాసన్స్ తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా వ్యవహరించనున్నప్పటికీ... కొత్త చైర్మన్ ఎంపిక పూర్తి కావడం ఆలస్యం ఆయన నూతన వారసుడికి బాధ్యతలు అప్పగించి తన పదవి నుంచి తప్పుకోనున్నారు.

పరిశీలనలో ఉన్న పేర్లు ఇవీ...
టాటా గ్రూపు నూతన చైర్మన్ ఎంపిక ప్రక్రియ వచ్చే రెండు వారాల్లో ప్రారంభం అవుతుందని... మూడు నుంచి నాలుగు నెలలు ఇందుకు సమయం పడుతుందని ఎంపిక కమిటీ సన్నిహిత వర్గాల సమాచారం. అయితే, ఇప్పటికే పలు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా ఇద్దరి విషయంలో రతన్ టాటా చాలా సానుకూలతతో ఉన్నట్టు తెలుస్తోంది. వారు నోయెల్ టాటా, ఇంద్రానూయి. నోయెల్ టాటా తమ కుటుంబంలో వ్యక్తి కాగా, ఇంద్రానూయి పనితీరు రతన్ టాటాను ఆకట్టుకుంది.

ముఖ్యంగా నోయెల్‌కు ఎక్కువ అవకాశాలున్నాయని, బయటి వ్యక్తి కంటే తమ కుటుంబంలో భాగమైన వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించవచ్చని ఆ వర్గాలు అంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో విస్తరించిన టాటాగ్రూపును నడిపించేందుకు లోకల్ వ్యక్తి కాకుండా అంతర్జాతీయంగా పేరున్న వ్యక్తి అయితే బాగుంటుందన్నది టాటా గ్రూపు ఆలోచనగా తెలుస్తోంది. అలా చూసుకుంటే ఇంద్రానూయి ఈ విషయంలో ముందుంటారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఆశ్చర్యం నుంచి అర్ధాంతరంగా..
సైరస్ మిస్త్రీ 1968, జూలై 4న జన్మించారు. లండన్ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్-టెక్నాలజీ అండ్ మెడిసిన్ నుంచి సివిల్ ఇంజినీరింగ్ పట్టా(గ్రాడ్యుయేషన్) పొందారు. తర్వాత లండన్ బిజినెస్ స్కూల్ నుంచి మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. 1991లో తండ్రి స్థాపించిన షాపూర్‌జీ పలోంజీ గ్రూప్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. కాగా, రతన్ స్థానంలో వారసుడిని ఎంపిక చేయటానికి నియమించిన కమిటీలో డెరైక్టర్ హోదాలో మిస్త్రీ కూడా అప్పుడు సభ్యుడే. అనూహ్యంగా కమిటీ మిస్త్రీనే నియమించింది. ఇక తొలగింపు నిర్ణయం తీసుకున్న బోర్డు సమావేశంలోనూ మిస్త్రీ పాల్గొన్నారు.

ఆరుగురు సభ్యులు వేటు వేసేందుకు అనుకూలంగా ఓటేయగా... ఒక్క మిస్త్రీ మాత్రమే ప్రతిఘటించినట్లు సమాచారం. ఇది కూడా ఆయనకు ఒక విధంగా అనూహ్య సంఘటనే. 150 ఏళ్ల టాటా సామ్రాజ్య చరిత్రలో(1868లో ఆవిర్భావం) 1932లో నౌరోజీ సక్లత్‌వాలా తర్వాత టాటా గ్రూపునకు సారథ్యం వహించిన టాటాల కుటుంబేతర వ్యక్తి మిస్త్రీయే. అంతేకాదు! ఇప్పటివరకూ టాటా సన్స్‌కు ఆరుగురు చైర్మన్లుగా వ్యవహరించగా.. అతితక్కువ కాలం పదవిలో కొనసాగింది కూడా మిస్త్రీయే.

మొత్తం తొమ్మిది మంది టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డులో, అదేవిధంగా ఇతర గ్రూప్ కంపెనీల్లో కూడా డెరైక్టర్‌గా మిస్త్రీ కొనసాగనున్నారు. ప్రస్తుతం టాటా గ్రూప్‌లో 7 లక్షల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 100కు పైగా విభిన్న వ్యాపారాలను నిర్వహిస్తోంది. పదవీ విరమణ తర్వాత రతన్ టాటా గౌరవ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు