చతికిలబడ్డ పారిశ్రామిక రంగం!

11 May, 2019 00:02 IST|Sakshi

మార్చిలో వృద్ధిలేకపోగా క్షీణత

మైనస్‌ 0.1 శాతంగా నమోదు

21 నెలల కనిష్టస్థాయి

78 శాతం వెయిటేజ్‌ ఉన్న తయారీ రంగం నీరసం

మిగతా రంగలూ ఇదే ధోరణి

న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక రంగం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2019 మార్చిలో (2018 మార్చితో పోల్చి) పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో అసలు వృద్ధి నమోదుకాలేదు. (మైనస్‌) 0.1 శాతం క్షీణత నమోదయ్యింది. పారిశ్రామిక రంగంలో ఈ తరహా క్షీణత పరిస్థితి తలెత్తడం 21 నెలల్లో ఇది తొలిసారి. మొత్తం సూచీలో దాదాపు 78 శాతం కలిగిన తయారీ రంగం పేలవ పనితీరు మొత్తం సూచీపై ప్రతికూల ప్రభావం చూపింది. శుక్రవారం విడుదలైన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... 

► 2018 మార్చిలో ఐఐపీ వృద్ధి రేటు 5.3 శాతం.  
► 2017 జూన్‌లో 0.3 శాతం క్షీణత నమోదయ్యింది. అటు తర్వాత ఈ తరహా ఫలితం ఇదే తొలిసారి.  
​​​​​​​►ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి రేటునూ దిగువముఖంగా సవరించడం గమనార్హం. ఇంతక్రితం ఈ రేటు 0.1 శాతం అయితే ఇప్పుడు 0.07 శాతానికి కుదించారు.  
​​​​​​​►   మార్చి నెలలో తయారీ రంగాన్ని చూస్తే, వృద్ధిలేకపోగా 0.4 శాతం క్షీణించింది. 2018 ఇదే నెలలో ఈ రంగం 5.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. మొత్తం 23 గ్రూపుల్లో 12 గ్రూపులు క్షీణతను నమోదుచేసుకున్నాయి.  
​​​​​​​►భారీ పెట్టుబడులకు ప్రతిబింబమైన భారీ యంత్రసామాగ్రి ఉత్పత్తికి సంబంధించి క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగం మార్చి నెలలో మరింతగా క్షీణించింది. 2018 మార్చిలో 3.1 శాతం క్షీణతలో ఉన్న ఈ విభాగం, తాజాగా 8.7 శాతం కిందకు దిగింది.  
​​​​​​​►  విద్యుత్‌ రంగం ఉత్పత్తి వృద్ధిలోనే ఉన్నా... ఈ స్పీడ్‌ 5.9 శాతం నుంచి (2018 మార్చి) 2.2 శాతానికి (2019 మార్చి) పడిపోయింది.  
​​​​​​​►   మైనింగ్‌ రంగంలోనూ విద్యుత్‌ రంగం ధోరణే కనబడింది. వృద్ధి రేటు 3.1 శాతం నుంచి 0.8 శాతానికి పడిపోయింది.  
​​​​​​​► కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో –5.1 శాతం క్షీణత నమోదయితే, కన్జూమర్‌ నాన్‌– డ్యూరబుల్స్‌ విభాగంలో కేవలం 0.3 శాతం వృద్ధి నమోదయ్యింది.  
2018–19లో మూడేళ్ల కనిష్టస్థాయి 
వార్షిక ప్రాతిపదికన చూస్తే, 2018 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి వరకూ పారిశ్రామిక వృద్ధి రేటు కేవలం 3.6 శాతంగా నమోదయ్యింది. ఈ రేటు మూడేళ్ల కనిష్టస్థాయి.  2017–18లో వృద్ధి రేటు 4.4 శాతం. 2016–17లో 4.6 శాతం, 2015–16లో 3.3 శాతం వృద్ధి రేట్లు నమోదయ్యాయి.  

మరిన్ని వార్తలు