బాబోయ్‌.. కరోనా!

28 Jan, 2020 05:36 IST|Sakshi

చైనా వైరస్ కల్లోలం... అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక ప్రభావం

2 శాతం మేర పతనమైన ప్రపంచ మార్కెట్లు

అదే బాటలో మన మార్కెట్‌ 458 పాయింట్లు క్షీణించి 41,155కు సెన్సెక్స్‌

29 పాయింట్ల నష్టంతో 12,119కు నిఫ్టీ

కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు కకావికలం అయిపోయాయి. చైనాలో మొదలైన కరోనా ప్రభావం ఇతర దేశాలకూ విస్తరిస్తోందన్న భయాలతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌ కూడా భారీగా నష్టపోయింది. దీంతో రెండు రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 41,200 పాయింట్లు, నిఫ్టీ 12,150 పాయింట్ల దిగువకు పడిపోయాయి. బడ్జెట్‌ మరో వారం రోజుల్లోనే ఉండటంతో అప్రమత్త వాతావరణం నెలకొన్నది. బ్యాంక్, లోహ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి.

డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు క్షీణించి 71.44(ఇంట్రాడే)కు పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించింది. ముడి చమురు ధరలు 3 శాతం మేర పతనమైనా, మార్కెట్‌పై అది ఏమంత ప్రభావం చూపించలేకపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 458 పాయింట్లు పతనమై 41,155 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయి 12,119 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 1.1 శాతం, నిఫ్టీ 1.06 శాతం మేర క్షీణించాయి. ఫార్మా మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌కు గత నాలుగు నెలల్లో ఇదే రెండో పెద్ద పతనం. సెన్సెక్స్, నిఫ్టీలు నెల కనిష్ట స్థాయికి పడిపోయాయి.

మధ్యాహ్నం తర్వాత అమ్మకాల వెల్లువ  
సెన్సెక్స్‌ నష్టాల్లోనే మొదలైంది. రోజంతా నష్టాలు కొనసాగాయి. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు, ఆర్థిక మందగమనం కారణంగా భారత ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ ఆదాయం గణనీయంగా తగ్గనున్నాయన్న వార్తలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో మధ్యాహ్నం తర్వాత లార్జ్‌క్యాప్‌ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. జనవరి సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు మరో నాలుగు రోజుల్లో ముగియనుండటం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 491 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్ల మేర నష్టపోయాయి.

విస్తరిస్తున్న కరోనా వైరస్‌...
చైనాలోని వూహన్‌  నగరంలో ప్రబలిన కరోనా వైరస్‌ బారిన పడి ఇప్పటికే 80 మంది మృతి చెందారు. 2,700 మందికి పైగా ఈ వైరస్‌ సోకి ఉంటుందని, వీరిలో 450 మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడైంది. చైనాలోనే కాకుండా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, జపాన్‌ తదితర దేశాలకు ఈ వైరస్‌ వ్యాపించిందని వార్తలు వస్తున్నాయి.

ఈ వైరస్‌ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి మరింతగా మందగించగలదనే భయాలతో ప్రపంచ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. చాంద్రమాన కొత్త సంవత్సరాది సెలవు కారణంగా పలు ఆసియా మార్కెట్లు పనిచేయలేదు. జపాన్‌ నికాయ్‌ సూచీ 2 శాతం పతనమైంది. యూరప్‌ మార్కెట్లు 2–2.5 శాతం నష్టాల్లో ముగిశాయి. అమెరికా సూచీలు ఒకానొకదశలో 2% నష్టాల్లోకి జారిపోయాయి.

లోహ షేర్లు విలవిల...
కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ, లోహాలను అధికంగా వినియోగించే చైనాలో తీవ్రమైన ప్రభావం ఉంటుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో లోహ షేర్లు క్షీణించాయి. జిందాల్‌ స్టీల్, సెయిల్, వేదాంత, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌ఎమ్‌డీసీ, హిం దుస్తాన్‌ కాపర్, హిందుస్తాన్‌ జింక్, హిందాల్కో షేర్లు 3–6% రేంజ్‌లో నష్టపోయాయి.

ఏడాది గరిష్టానికి వందకు పైగా షేర్లు
స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమైనా, దాదాపు వందకు పైగా  షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయికి చేరడం విశేషం. వీటిల్లో 50కు పైగా షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. పీవీఆర్, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, బెర్జర్‌ పెయిం ట్స్, దివీస్‌ ల్యాబ్స్, డాబర్‌ ఇండియా, డాక్టర్‌ పాథ్‌ల్యాబ్స్,   ఇంద్రప్రస్థ గ్యాస్, ఐనాక్స్‌  లీజర్, జేకే సిమెంట్, జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్, మణప్పురమ్‌ ఫైనాన్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి.

మరిన్ని విశేషాలు... 
►టాటా స్టీల్‌ 4.3 శాతం నష్టంతో రూ.462 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  
►30 సెన్సెక్స్‌ షేర్లలో 21 షేర్లు నష్టపోగా, 9 షేర్లు మాత్రం లాభపడ్డాయి.  
►హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 2.2–2.5% మేర నష్టపోయాయి. సెన్సెక్స్‌ మొత్తం 458 పాయింట్ల నష్టంలో ఈ రెండు షేర్ల వాటాయే 216 పాయింట్ల మేర ఉంది.  
►ఈ క్యూ3లో ఆదాయం 14 శాతం మేర పెరగడంతో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్‌ 5 శాతం లాభంతో రూ.3,188 వద్ద ముగిసింది. నిఫ్టీలో అత్యధికంగా పెరిగిన షేర్‌ ఇదే.  
►మూడేళ్ల తర్వాత ఈ క్యూ3లోనే లాభాల్లోకి రావడంతో ఓకార్డ్‌ షేర్‌ 18 శాతం లాభంతో రూ. 353 వద్దకు చేరింది.

రూ. లక్ష కోట్ల సంపద ఆవిరి...
స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల కారణంగా రూ. లక్ష కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.1.03,154 కోట్లు తగ్గి రూ.1,59,24,405 కోట్లకు పడిపోయింది.

>
మరిన్ని వార్తలు