డొమైన్‌ పేర్లు ఇక మన భాషల్లోనే..

13 Aug, 2018 12:34 IST|Sakshi
డొమైన్‌ పేరు (ఫైల్‌ ఫోటో)

ఏదైనా వెబ్‌సైట్ రూపుదిద్దుకోవాలంటే డొమైన్‌ అనేది కచ్చితంగా అవసరం. ఏ భాషకు సంబంధించి వారైనా సరే తమకు నచ్చిన డొమైన్‌ కావాలంటే దానిని ఇంగ్లీష్‌లో వెతుకోవాల్సిందే. అయితే రానున్న కాలంలో ఇంగ్లీష్‌లో డొమైన్‌ వెతికే ప్రక్రియకు రాంరాం చెప్పొచ్చట. మాతృభాషలోనే తమకు కావాల్సిన డొమైన్‌ను వెతుకునే సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిసింది. దీనికోసం ‘ది ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అసైన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్’, ‘ది నాన్‌ ప్రాఫిట్‌ కార్పొరేషన్‌’, ఇంటర్నెట్ డొమైన్‌ నేమ్స్‌’ సంస్థలు కసరత్తు చేస్తున్నట్టు వెల్లడైంది. 

భారత్‌లోని 22 షెడ్యూలు భాషలతో పాటు, వాడుకలో ఉన్నఅనేక భాషలలో డొమైన్లు తీసుకొచ్చే ఏర్పాట్లను ఆ సంస్థలు చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు, బెంగాలీ, దేవనాగరి, గుర్మకి, కన్నడ, మలయాళం, ఒరియా, తమిళ్‌ భాషలపై ప్రస్తుతం పరిశీలన కొనసాగుతోందని ఐసీఏఎన్‌ఎన్‌ అధికారి సమ్రిన్‌ గుప్తా చెప్పారు. ఈ స్క్రిప్టులు పలు స్థానిక భాషలను కవర్‌ చేయనున్నట్టు తెలిపారు. ప్రపంచంలో ఇంగ్లీష్‌ పరిజ్ఞానం లేని వారు సైతం వారి మాతృభాషలో వెతికి అక్కడి వెబ్‌సైట్లను, ఆన్‌లైన్‌ను సందర్శించవచ్చని తెలిపారు. 

ఉదాహరణకు ఒక వ్యక్తి తన హిందీ భాషకు సంబంధించిన వెబ్‌సైట్‌ పేరును హిందీలో టైప్‌ చేస్తే ఆ వెబ్‌సైట్ వచ్చేవిధంగా ప్రస్తుత విధానం రూపుదిద్దుకుంటోంది. అంటే ఇక నుంచి దీని కోసం ఇంగ్లీష్‌ భాషనే వాడాల్సినవసరం లేదు. ప్రపంచ జనాభాలో ప్రస్తుతం 52శాతం మందే ఇంగ్లీష్‌ పరిజ్ఞానం ఉండి ఇంటర్నెట్‌ బాగా ఉపయోగిస్తున్నారని గుప్తా చెప్పారు. మిగిలిన 48శాతం మంది అంటే ఎవరికైతే ఇంగ్లీష్‌పై అంతగా అవగాహన లేదో, వారికి తమ తమ భాషల్లో డొమైన్‌ పేర్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రజలు వారు మాతృభాషలో టైప్‌ చేసే మెళకువలు నేర్చుకుంటే చాలు ఈ ప్రయత్నం ఉపయోగకరంగా మారుతుందని గుప్తా తెలిపారు. ఇప్పటికే మాతృభాషల్లో టైప్‌ చేస్తే చాలు గూగుల్‌, ఇతర సెర్చింజన్లకు కావాల్సిన సమాచారం అందజేస్తున్నాయి. దేవనాగరి, గుజరాతి, గుర్ముకి, కన్నడ, ఒరియా, తెలుగు భాషల ప్రతిపాదనల కోసం ఇప్పటికే కంపెనీ ప్రజా స్పందనను కోరుతోంది. ప్రస్తుతం 4.2 బిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులుండగా, 2022కు ఆ సంఖ్య 5 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా.
  

మరిన్ని వార్తలు