భారీ విస్తరణ దిశగా కిమ్స్‌..

19 Jan, 2017 02:15 IST|Sakshi
భారీ విస్తరణ దిశగా కిమ్స్‌..

ఫిబ్రవరికల్లా ఒంగోలు ఆసుపత్రి పూర్తి
మరో మూడు రాష్ట్రాల్లోనూ ఏర్పాటు
కొత్తగా 4,000 మంది నియామకం
కిమ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అభినయ్‌  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న కిమ్స్‌ హాస్పిటల్స్‌... ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో ఫిబ్రవరినాటికి 300 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తేనున్నట్లు తెలియజేసింది. రూ.60 కోట్లతో ఒంగోలులో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కొండాపూర్‌లోని 100 పడకల ఆసుపత్రికి ఇటీవలే రూ.40 కోట్ల ఖర్చుతో మరో 100 పడకలను జోడించారు. కొండాపూర్‌ ప్రాంతంలో నాణ్యమైన వైద్య సేవలకు డిమాండ్‌ పెరిగిందని, అందుకే విస్తరణ చేపట్టామని కిమ్స్‌ హాస్పిటల్స్‌ స్ట్రాటజీ వైస్‌ ప్రెసిడెంట్‌ అభినయ్‌ బొల్లినేని ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు.

‘‘ఇంకా గువహటి, భువనేశ్వర్, ఇండోర్‌ నగరాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించాం. ఇవి ఒక్కొక్కటి 250 పడకల సామర్థ్యంతో వస్తాయి. ఈ మూడు సెంటర్లకు రూ.450 కోట్ల దాకా వెచ్చిస్తాం. 2018 చివరికల్లా నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని అభినయ్‌ వివరించారు. ప్రస్తుతం సంస్థ వద్ద అన్ని విభాగాల్లో కలిపి 7,000 మందికిపైగా పని చేస్తున్నారు. ప్రతిపాదిత విస్తరణ పూర్తయితే ఈ సంఖ్య 11,000 దాటుతుందని ఆయన వెల్లడించారు. కిమ్స్‌కు తెలంగాణలో సికింద్రాబాద్, కొండాపూర్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళంలో ఆసుపత్రులున్నాయి. వీటి సామర్థ్యం 2,200 పడకలు. శ్రీకాకుళంలోని మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా 500 పడకల ఆసుపత్రి ఉంది.

>
మరిన్ని వార్తలు