రైలు ప్రయాణికులకు శుభవార్త.. ప్రతిఒక్కరికీ కన్ఫర్మ్‌డ్‌ టికెట్‌!

16 Nov, 2023 19:51 IST|Sakshi

రద్దీ రైళ్లతో విసిగిపోయిన ప్రయాణికులకు శుభవార్త ఇది. 2027 నాటికల్లా ప్రతి రైలు ప్రయాణికుడికి కన్ఫర్మ్‌డ్‌ టికెట్‌ లభించనుంది. ఈ మేరకు రైళ్ల సంఖ్యను పెంచుతూ విస్తృత విస్తరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు రైల్వే శాఖ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ వార్తా సంస్థ ఎన్‌డీటీవీ పేర్కొంది.

దీపావళి పండుగ సందర్భంగా ఇటీవల ప్రయాణికులతో రద్దీగా మారిన ప్లాట్‌ఫామ్‌లు, రైళ్లలో కిక్కిరిసిన ప్రయాణికుల చిత్రాలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. ఛత్ పండుగ కోసం బిహార్ వెళ్లే రైలు ఎక్కే ప్రయత్నంలో 40 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ విస్తరణ ప్రణాళికలు చేపట్టనుండటం కోట్లాది మంది ప్రయాణికులకు ఊరటనిచ్చే విషయం.

కొత్త రైళ్లు, ట్రాక్‌ల నిర్మాణం
ఈ విస్తరణ ప్రణాళిక కింద  ఏటా 4,000-5,000 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం జరుగనుంది. ప్రస్తుతం రోజుకు 10,748 రైళ్లు నడుస్తుండగా ఈ సంఖ్యను 13,000కు పెంచాలన్న ఈ ప్రణాళిక లక్ష్యంగా తెలుస్తోంది. రాబోయే మూడు నాలుగేళ్లలో 3,000 కొత్త రైళ్లను ట్రాక్‌లపైకి తీసుకురావాలనేది ప్రణాళిక అని రైల్వే వర్గాలు తెలిపాయి. అలాగే ఏటా 800 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుండగా ఈ సామర్థ్యాన్ని 1,000 కోట్లకు పెంచాలనేది కూడా విస్తరణ ప్రణాళికలో భాగం.

ప్రయాణ సమయం తగ్గింపుపై దృష్టి
ఇక రైళ్ల ప్రయాణ సమయాన్ని తగ్గించడంపైనా రైల్వే శాఖ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా మరిన్ని ట్రాక్‌ల నిర్మాణం, వేగాన్ని పెంచడానికి చర్యలు తీసుకోనుంది. రైల్వే శాఖ అధ్యయనం ప్రకారం, ఢిల్లీ నుంచి కోల్‌కతాకు ప్రయాణంలో త్వరణం, వేగాన్ని పెంచితే రెండు గంటల ఇరవై నిమిషాలు ఆదా అవుతాయి. పుష్ అండ్‌ పుల్ టెక్నిక్ త్వరణం, వేగాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం ఏటా దాదాపు 225 రైళ్లు తయారవుతుండగా వీటిలో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రతిష్టాత్మక వందే భారత్ రైళ్లలో యాక్సిలరేషన్, డీసిలరేషన్ సామర్థ్యం సాధారణ రైళ్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని వార్తలు