దీర్ఘకాలిక రాబడులు భేష్‌

15 Apr, 2019 07:48 IST|Sakshi

రిలయన్స్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌

ఏడాది కాలంలో మిడ్, స్మాల్‌క్యాప్‌ కంపెనీల షేర్లు చాలా వరకు నష్టపోయాయి. దీంతో దీర్ఘకాల పెట్టుబడి అవకాశాల దృష్ట్యా కొన్ని ఆకర్షణీయంగా మారాయి. మిడ్, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు ఈ సమయంలో ఆయా విభాగాలకు చెందిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలను నమ్ముకోవడం ద్వారా తగిన ప్రతిఫలాన్ని అందుకోవచ్చు. ఆ విధంగా చూసినప్పుడు రిలయన్స్‌ స్మాల్‌క్యాప్‌ పథకం కూడా ఒక ఎంపిక అవుతుంది. మార్కెట్‌ ర్యాలీల్లో మంచి పనితీరును చూపించడమే కాకుండా, మార్కెట్‌ కరెక్షన్లలో నష్టాలను పరిమితం చేయడాన్ని ఈ పథకం పనితీరులో గమనించొచ్చు. ఇందుకు నిదర్శనం గత ఏడాది కాలంలో ఇదే విభాగంలోని ఇతర పథకాలు, బెంచ్‌ మార్క్‌ సూచీతో పోలిస్తే రిలయన్స్‌ స్మాల్‌క్యాప్‌ పథకం నష్టాలను పరిమితం చేసింది.

ఏడాది కాలంలో రాబడులు మైనస్‌ 7.5 శాతంగా ఉంటే, బెంచ్‌ మార్క్‌ బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ టీఆర్‌ఐ 11.5 శాతం మేర నష్టాలను ఇవ్వడం గమనార్హం. అంటే బెంచ్‌ మార్క్‌తో పోలిస్తే నష్టాలు 4 శాతం తక్కువే. ఇక మూడేళ్ల కాలంలో రిలయన్స్‌ స్మాల్‌క్యాప్‌ పథకం వార్షికంగా 18.8 శాతం రాబడులను ఇచ్చింది. ఐదేళ్లలో వార్షిక ప్రతిఫలం 24.7 శాతంగా ఉంది. డీఎస్‌పీ స్మాల్‌క్యాప్, ఫ్రాంక్లిన్‌ ఇండియా స్మాలర్‌ కంపెనీస్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ స్మాల్‌క్యాప్‌ పథకాల కంటే ఈ పథకమే మెరుగ్గా ఉంది. ఈ పథకం 2010లో ప్రారంభం కాగా, అప్పటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడులు 17.71 శాతంగా ఉండడం గమనార్హం. ఇన్వెస్టర్లు కనీసం ఐదేళ్లు, అంతకు మించి కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలనుకునేవారు సిప్‌ మార్గంలో ఈ పథకంలో పెట్టుబడులు పెట్టుకోవడాన్ని పరిశీలించొచ్చు. 

పెట్టుబడుల విధానం
పోర్ట్‌ఫోలియో విషయంలో తగినంత వైవిధ్యాన్ని ఈ పథకం పాటిస్తుంటుంది. అస్థిరతల సమయంలో నగదు నిల్వలను పెంచుకోవడాన్ని గమనించొచ్చు. విడిగా ఒక్కో కంపెనీలో మరీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తను పాటిస్తుంటుంది. అందుకే ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్‌ సంఖ్య భారీగా కనిపిస్తుంది. ప్రస్తుతం 114 కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉంది. అన్ని రకాల మార్కెట్‌ సైకిల్స్‌లోనూ కనీసం 100 స్టాక్స్‌ అయినా పోర్ట్‌ఫోలియోలో నిర్వహిస్తుంటుంది. అలాగే, ఒక్కో రంగంపైనా భారీగా ఆధారపడకపోవడాన్ని గమనించొచ్చు. ఇంజనీరింగ్‌లో 14.2 శాతం, కెమికల్స్‌లో 13.66 శాతం, ఫైనాన్షియల్స్‌లో 12 శాతం, ఎఫ్‌ఎంసీజీలో 10.5 శాతం, కన్‌స్ట్రక్షన్‌ రంగాల్లో 9 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం 0.65 శాతం వరకు నగదు నిల్వలు కలిగి ఉండగా, డెట్‌లో 8 శాతానికి పైగా పెట్టుబడులు కలిగి ఉంది. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో 10.4 శాతం, మిడ్‌క్యాప్‌లో 21.60%, స్మాల్‌క్యాప్‌ విభాగంలో 68 శాతం వరకు పెట్టుబడులు పెట్టి ఉంది.

మరిన్ని వార్తలు