నేడు నిఫ్టీకి 9431-9547 వద్ద రెసిస్టెన్స్‌

28 May, 2020 08:54 IST|Sakshi

నేడు సానుకూల ఓపెనింగ్‌- ఆపై?

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 34 పాయింట్లు ప్లస్‌

యూఎస్‌ మార్కెట్లు అప్‌

నేడు మే నెల డెరివేటివ్స్‌ ముగింపు

అటూఇటుగా ఆసియా మార్కెట్లు 

నేడు (గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 9,345 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మే నెల ఫ్యూచర్స్‌  9,311  వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచీ ఆర్థిక వ్యవస్థ బలపడనున్న అంచనాలతో బుధవారం యూఎస్‌ మార్కెట్లు 1-2.2 శాతం మధ్య పుంజుకోగా.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. కాగా.. నేడు దేశీయంగా మే నెల డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో ఇంట్రాడేలో ఆటుపోట్లకు చాన్స్‌ ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

బుల్‌ దూకుడు
బుధవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు ఉన్నట్టుండి జోరందుకున్నాయి. బుల్‌ ఆపరేటర్లు కదం తొక్కడంతో సెన్సెక్స్‌ ఏకంగా 1,000 పాయింట్లు జంప్‌చేసింది. ఇక నిఫ్టీ సైతం దాదాపు ట్రిపుల్‌ సెంచరీ చేసింది. తొలుత బలహీనంగా ప్రారంభమైనప్పటికీ సమయం గడిచేకొద్దీ మార్కెట్లు పరుగందుకున్నాయి. చివరికి సెన్సెక్స్‌ 996 పాయింట్లు జమ చేసుకుని 31,605 వద్ద నిలవగా.. నిఫ్టీ 286 పాయింట్లు ఎగసి 9,315 వద్ద ముగిసింది. ఇది దాదాపు రెండు వారాల గరిష్టంకాగా.. సెన్సెక్స్‌ తొలుత 30,526 దిగువన ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. తదుపరి జోరందుకుని 31,660ను అధిగమించింది. ఇది 1050 పాయింట్ల వృద్ధికిగా.. నిఫ్టీ సైతం ఒక దశలో 9334 వద్ద గరిష్టాన్ని చేరుకోగా, 9004 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ప్రధానంగా బ్యాంకింగ్‌ స్టాక్స్‌ లాభాల దుమ్మురేపాయి. 


నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 9102 పాయింట్ల వద్ద, తదుపరి 8,888 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 9,431 పాయింట్ల వద్ద, ఆపై 9,547 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 18480 పాయింట్ల వద్ద, తదుపరి 18290 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ ఫ్టీకి తొలుత 19020 పాయింట్ల వద్ద, తదుపరి 19430 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 335 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2409 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4716 కోట్లు, డీఐఐలు రూ. 2841 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు