వచ్చే వారం ఆటుపోట్లు తప్పకపోవచ్చు!

23 May, 2020 11:26 IST|Sakshi

నిఫ్టీ 8800- 9300 మధ్య కదలవచ్చు

ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం

సోమవారం(25న) మార్కెట్లకు సెలవు

మే నెల ఎఫ్‌అండ్‌వో 28న ముగింపు

హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ ఫార్మా, లుపిన్‌ డీమా‍ర్ట్‌ ఫలితాలు

వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కోనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రంజాన్‌ పర్వదినం సందర్భంగా సోమవారం(25న) మార్కెట్లకు సెలవుకాడంతో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. మే నెల డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు గురువారం(28న) ముగియనుంది. దీంతో వచ్చే వారం మొదట్లో ట్రేడర్లు పొజిషన్లను జూన్‌ నెలకు రోలోవర్‌ చేసుకునే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలో 8800 వద్ద స్ట్రైక్స్‌తో గరిష్ట పుట్‌ బేస్‌ 9,000 వద్ద ఉన్నట్లు ఆప్షన్స్‌ డేటా సూచిస్తోంది. వెరసి నిఫ్టీకి ఈ స్థాయిల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని అంచనా వేస్తున్నారు. నిఫ్టీ లోయర్‌ టాప్‌, లోయర్‌ బాటమ్‌లను తాకుతుండటంతో అంతర్గతంగా మార్కెట్లు బలహీనంగా ఉన్నట్లు చెబుతున్నారు. రోజువారీ చార్టుల ప్రకారం శుక్రవారం నిఫ్టీలో డోజీ పేటర్న్‌ ఏర్పడిందని..  ఇది అటు బుల్స్‌, ఇటు బేర్స్‌కు ఎలాంటి పట్టునూ ఇవ్వకపోవడాన్ని సూచిస్తున్నట్లు వివరించారు. 

8600-9600
గత వారం నిఫ్టీ 9,100 దిగువనే ముగిసింది. వరుసగా మూడో వారం ఆటుపోట్ల మధ్య నష్టాలతో నిలిచింది. చార్టుల ప్రకారం గత వారం నిఫ్టీ కదలికలు హ్యామర్‌ తరహా కేండిల్‌ను సూచిస్తు‍న్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో నమోదైన గరిష్టం నుంచి 61.8 శాతం రీట్రేస్‌మెంట్‌(8055-9890) స్థాయి 8756 వద్ద నిఫ్టీకి మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో నిఫ్టీ 8,600- 9,600 పాయింట్ల పరిధిలో కదిలే వీలున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు. అటు ప్రభుత్వం, ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ ప్యాకేజీలు, లిక్విడిటీ చర్యలకు అనుగుణంగా మార్కెట్లు స్పందిస్తున్నట్లు తెలియజేశారు. నిఫ్టీకి 8,800 వద్ద కీలక మద్దతు లభించవచ్చని, ఇదే విధంగా 9,300 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్‌ టెక్నికల్‌ హెడ్‌ ధర్మేష్‌ షా పేర్కొన్నారు. కాగా.. వచ్చే వారం దిగ్గజ కంపెనీలు హెచ్‌డీఎఫ్‌సీ, లుపిన్‌, సన్‌ ఫార్మా, డీమార్ట్‌ తదితరాలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు ప్రకటించనున్నాయి.

మరిన్ని వార్తలు