‘డీజిల్‌ కార్లు’ కొనసాగుతాయి: మారుతి 

17 Apr, 2019 00:31 IST|Sakshi

న్యూఢిల్లీ: సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండే డీజిల్‌ కార్ల ఉత్పత్తి ఇక మీదట కూడా కొనసాగుతుందని దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుండి బీఎస్‌–6 ఉద్గార నిబంధనలు అమలుకానున్న నేపథ్యంలో ఈ తరహా కార్ల ఉత్పత్తిని కంపెనీ నిలిపివేయనుందనే అనుమానాలకు సమాధానంగా సంస్థ చైర్మన్‌ ఆర్‌.సి భార్గవ ఈ మేరకు ప్రకటనచేశారు. ఉత్పత్తి నిలిపివేత అంశంపై బదులిచ్చిన ఆయన.. ‘డీజిల్‌ కార్ల ఉత్పత్తి ఆపేస్తామని ఎన్నడూ చెప్పలేదు.

రానున్న రోజుల్లో చిన్నపాటి డీజిల్‌ ఇంజిన్‌ కార్ల ధరలు గణనీయంగా పెరుగుతాయి కనుక.. ఎంట్రీ లెవెల్‌ విభాగంలో వినియోగదారులు కొనుగోలు చేయదగిన వాటిని మాత్రమే అందుబాటులో ఉంచాలని ప్రణాళిక రూపొందించాం. ఈ క్యాటగిరీలో మార్కెట్‌ సీఎన్‌జీ వైపు మారుతోంది. ప్రస్తుతం దేశీ ప్యాసింజర్‌ వాహన మార్కెట్లో 51 శాతం వాటా ఉన్న మా సంస్థ.. ఉత్పత్తి పూర్తిగా ఆపివేస్తే వాటా తగ్గిపోతుంది. కేవలం మా సంస్థ కార్లు మాత్రమే కాకుండా.. అన్ని కంపెనీలకు ఇది వర్తిస్తుంది’ అని వివరించారు. 

>
మరిన్ని వార్తలు