ముత్తూట్‌ ఫైనాన్స్‌ షేరు రికార్డ్‌

18 Jun, 2020 12:20 IST|Sakshi

Q4 ఫలితాల ఎఫెక్ట్

‌షేరు 13 శాతం హైజంప్‌

కొత్త గరిష్టానికి ముత్తూట్‌ 

ట్రేడింగ్ పరిమాణం అప్‌

గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ముత్తూట్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది. తాజాగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 15 శాతం దూసుకెళ్లింది. రూ. 1150 సమీపానికి చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 13 శాతం జంప్‌చేసి రూ. 1129 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలి పావుగంటలోనే ఈ కౌంటర్లో ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో కలిపి 3.12 మిలియన్‌ షేర్లు చేతులు మారాయి. కాగా.. ఈ ఏడాది మార్చి 24న ముత్తూట్‌ ఫైనాన్స్‌ షేరు రూ. 477 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. తదుపరి ర్యాలీ బాటలో సాగుతూ రెట్టింపునకుపైగా ఎగసింది.

నిధుల దన్ను
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ నికర లాభం 59 శాతం వృద్ధితో రూ. 836 కోట్లను తాకింది. కన్సాలిడేషన్‌ ప్రాతిపదికన నిర్వహణలోని ఆస్తులు(రుణాలు) 22 శాతం పెరిగి రూ. 46,871 కోట్లను తాకాయి. క్యూ4లో గోల్డ్‌ లోన్‌ పోర్ట్‌పోలియో రూ. 3113 కోట్లు పెరిగి రూ. 41,611 కోట్లకు చేరింది. గత రెండు త్రైమాసికాలలో ముత్తూట్‌ ఫైనాన్స్‌ ఈసీబీల జారీ ద్వారా 1 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది. బంగారం ధరల ర్యాలీ, పసిడిపై రుణాలకు పెరుగుతున్న డిమాండ్‌ వంటి అంశాలు కంపెనీకి జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు