టెకీలకు భారీ డిమాండ్‌

8 May, 2018 08:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టెకీలకు ఐటీ పరిశ్రమ తీపికబురు అందించింది. రానున్న రెండు క్వార్టర్లలో భారీ స్ధాయిలో ఉద్యోగులను నియమించుకోవాలని ఐటీ కంపెనీలు యోచిస్తున్నాయి. నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు గత ఏడాదితో పోలిస్తే రానున్న ఆరు నెలల్లో పెద్దసంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకుంటామని ఐటీ మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఇండియా చేపట్టిన సర్వేలో 500 ఐటీ కంపెనీలు వెల్లడించాయి. నూతన టెక్నాలజీల నేపథ్యంలో నవ్యతకు పెద్దపీట వేసేందుకు ఐటీ కంపెనీలు హైరింగ్‌ను ముమ్మరంగా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయని, దీంతో టెక్నాలజీ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని సర్వే నిర్వహించిన ఎక్స్‌పెరిస్‌ ఐటీ, మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ మన్మీత్‌ సింగ్‌ చెప్పారు.

ఐటీలో ఉపాధి అవకాశాలు సిద్ధంగా ఉన్నాయని, సరైన నైపుణ్యాలున్న వారికి మెరుగైన వేతనం చెల్లించేందుకు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయన్నారు. బిగ్‌ డేటా అనలిటిక్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, ఏఐ డెవలపర్లకు అత్యధిక వేతనాలను ఆఫర్‌ చేస్తున్నారని చెప్పారు. 0-5 ఏళ్ల అనుభవంతో నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలనుకునే యువతకు కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయన్నారు. నూతన టెక్నాలజీల్లో కెరీర్‌ను ఎంచుకోవాలనుంటే నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, కొత్త టెక్నాలజీలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఐటీ పరిశ్రమలో మార్పులను అవగతం చేసుకుని అందుకు అనుగుణంగా నైపుణ్యాలను సంతరించుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు