సేల్స్‌ మరోసారి ఢమాల్‌, ఆందోళనలో పరిశ్రమ 

10 Feb, 2020 16:42 IST|Sakshi

నాలుగు నెలల కనిష్టానికి అమ్మకాలు

ఆటోమొబైల్‌ కంపెనీలకు మరోసారి  భారీ షాక్‌

బడ్జెట్‌లో లభించని ఊరట

ఏప్రిల్‌ నుంచి అమలు కానున్న బీఎస్‌-6  నిబంధనలు

సాక్షి, ముంబై: దేశీయంగా ఆటో మొబైల్‌ పరిశ్రమకు మరోసారి షాక్‌ తగిలింది. ఇప్పటికే దశాబ్దం కనిష్టానికి పడిపోయిన వాహనాలు అమ్మకాలు  కొత్త ఏడాదిలో కూడా అదే ధోరణిని కొనసాగించాయి.  2020 జనవరిలో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 6.2 శాతం క్షీణించాయి. వరుసగా మూడవ నెల క్షీణత.  2019 సెప్టెంబర్  అమ్మకాలు  దాదాపు 24 శాతం  క్షీణించాయి. వాణిజ్య వాహనాలు,  ద్విచక్ర వాహనాల అమ్మకాలు క్రమేపీ క్షీణతను నమోదు చేయడం మరింత ఆందోళనకు  రేపుతోంది.  

తాజా గణాంకాల  ప్రకారం జనవరి నెలలో కారు సేల్స్ కూడా 8.1 శాతం తగ్గిపోయాయి. గత ఏడాది జనవరిలో ఈ సేల్స్ 1,79,324 యూనిట్లు కాగా, ఈ జనవరిలో 1,64,793 యూనిట్లకు పడిపోయాయి. వ్యాన్ల అమ్మకం 28 శాతం క్షీణించి 12,992 వద్ద ఉంది. వాణిజ్య వాహనాల అమ్మకాలు 14 శాతం తగ్గి 75,289 యూనిట్లకు చేరుకోగా, గ్రామీణ వినియోగ ధోరణిని సూచించే ద్విచక్ర వాహనాలు 16 శాతం తగ్గి 13,41,005 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ నెలలో మొత్తం ఆటో మొబైల్స్ అమ్మకాలు 14 శాతం తగ్గి 17,39,975 యూనిట్లకు చేరుకున్నాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్ 14.04 శాతం మేర తగ్గి 87,591నుండి 75,289కు పడిపోయాయి. ఆటోఎక్స్‌పో కారణంగా వినియోగదారుల సెంటిమెంట్ బలపడుతుందని భావిస్తున్నామని, తద్వారా సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నట్లు   పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 

ఓనర్‌షిప్ వ్యయం పెరగడంతో పాటు జీడీపీ వృద్ధి రేటు మందగింపు లాంటివి అమ్మకాలు పతనానికి కారణమని ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాడీ సియామ్‌ సోమవారం వెల్లడించింది. దీనికితోడు  ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న బీఎస్‌-6  నిబంధనలకనుగుణంగా మారాల్సిన నేపథ్యం కూడా సేల్స్ తగ్గడానికి ప్రధాన కారణమని సియామ్‌  అధ్యక్షుడు రాజన్ వాధేరా  తెలిపారు. ఈ పరివర్తనం చెందడానికి పరిశ్రమకున్న సమయం చాలా  తక్కువ అని  పేర్కొన్నారు. ప్యాసెంజర్‌ వాహనా అమ్మకాల  క్షీణత రేటు గతంలో ఉన్నదానికంటే చాలా తక్కువగా  ఉన్నప్పటికీ దేశంలో ముదురుతున్న ఆర్థిక మందగమనానికి ఇది నిదర్శనమని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేష​ మీనన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, ఇతరకారణాల రీత్యా ఉద్గార నిబంధనల అమలు గడువును మరింత కాలం పొడిగించాలని కూడా కోరుతున్నాయి.

మరిన్ని వార్తలు