చార్జీల భారం లేకుండా చెల్లింపులు

20 Feb, 2018 00:09 IST|Sakshi

గూగుల్‌ ‘తేజ్‌’ కొత్త ఆఫర్‌

న్యూఢిల్లీ: తేజ్‌ యాప్‌ వినియోగదారులకు శుభవార్త. ఒక బ్యాంక్‌ ఖాతా నుంచి మరొక బ్యాంక్‌ ఖాతాకు డబ్బుల్ని పంపడం, పొందటం వంటి డిజిటల్‌ పేమెంట్స్‌ కోసం గూగుల్‌ ఇండియా గతేడాది సెప్టెంబర్‌లో ఒక మొబైల్‌ వాలెట్‌ యాప్‌ ‘తేజ్‌’ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. సంస్థ ఇప్పుడు ఈ యాప్‌ను సరికొత్త ఫీచర్‌తో అప్‌డేట్‌ చేసింది.

యుటిలిటీ బిల్‌ పేమెంట్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో యూజర్లు తేజ్‌ యాప్‌ ద్వారా వాటర్, ఎలక్ట్రిసిటీ, డీటీహెచ్, మొబైల్‌ బిల్లులను చెల్లించొచ్చు. అది కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్‌ చార్జీలు లేకుండా. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ఆధారంగా పనిచేసే తేజ్‌ యాప్‌ ద్వారా దాదాపు 90 యుటిలిటీ సంస్థల కస్టమర్లు వారి బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చని సంస్థ పేర్కొంది.

‘మా డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌కి కొత్తగా బిల్‌ పే ఫీచర్‌ను జోడించాం. దీంతో ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్, డీటీహెచ్, ఇన్సూరెన్స్‌ ప్రీమియం సహా వివిధ రకాల బిల్లులను చెల్లించొచ్చు’ అని గూగుల్‌ నెక్స్‌ బిలియన్‌ యూజర్స్‌ (కామర్స్‌ అండ్‌ పేమెంట్స్‌ విభాగం) వైస్‌ ప్రెసిడెంట్‌ డయానా లేఫీల్డ్‌ వివరించారు. బిల్లు గడువు దగ్గరకు వచ్చినప్పుడు తేజ్‌ యాప్‌ నోటిఫికేషన్‌ ద్వారా ఆ విషయాన్ని యూజర్లకు గుర్తు చేస్తుందని తెలిపారు.   

మరిన్ని వార్తలు