Diwali 2023: భారత్ నిర్ణయంతో చైనాకు రూ.50000 కోట్లు నష్టం - ఎలా అంటే?

10 Nov, 2023 10:44 IST|Sakshi

భారతదేశంలో వైభవంగా జరుపుకునే పండుగల్లో ఒకటైన 'దీపావళి' సందర్భంగా దేశీయ మార్కెట్లో బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది. వాహన అమ్మకాలు, బంగారం, నిత్యావసర వస్తువుల సేల్స్ ఒక ఎత్తయితే, టపాసులు విక్రయాలే మరో ఎత్తుగా సాగుతాయి. రాబోయే దీపావళిని దృష్టిలో ఉంచుకుని భారత్ చైనా వస్తువులను పూర్తిగా బహిష్కరించింది. దీని వల్ల చైనాకు వేలకోట్లు నష్టం వాటిల్లుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

చైనా వస్తువులను భారతదేశంలోకి దిగుమతి చేసుకోకూడదని తీసుకున్న నిర్ణయంతో చైనా సుమారు రూ. 50,000 కోట్ల వ్యాపార నష్టాన్ని చవిచూడనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది. 

గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చైనా ఉత్పత్తుల బహిష్కరణకు కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ పిలునివ్వడంతో దీపావళి సమయంలో చైనా ఉత్పతుల దిగుమతులు భారీగా తగ్గుతాయి. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచడానికి 'సీఏఐటీ' ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: అమెరికా వదిలి ఇండియాకు.. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఇతడొక వారధి!

'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ వెల్లడించాడు. దీపావళి పండుగ సమయంలో వినియోగదారులు సుమారు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తూ.. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి చైనా ఉత్పత్తుల దిగుమతి నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.

దేశంలోని ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, లక్నో, చండీగఢ్, రాయ్‌పూర్, భువనేశ్వర్, కోల్‌కతా, రాంచీ, గౌహతి, పాట్నా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, మదురై, పాండిచ్చేరి మొదలైన ప్రాంతాల్లోని వినియోగదారులు చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని, బదులుగా భారతీయ వస్తువులకు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.

గతంలో కూడా భారీ నష్టం..
ప్రతి సంవత్సరం పండుగ సీజన్‌లలో భారతీయ వ్యాపారులు చైనా నుంచి రూ.70,000 కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటారని సమాచారం. అయితే భారత్ తీసుకున్న నిర్ణయంతో చైనా.. రాఖీ సందర్భంగా సుమారు రూ.5,000 కోట్లు, వినాయక చవితి సమయంలో రూ. 500 కోట్ల నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు