భారీ నష్టాల్లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌

7 Aug, 2018 14:40 IST|Sakshi
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సి కుంభకోణంతో తీవ్రంగా ప్రభావితమైన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మరోసారి భారీగా నష్టాలను నమోదు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌-జూన్‌) తొలి క్వార్టర్‌లో బ్యాంక్‌ రూ.940 కోట్ల మేర నష్టాలను నమోదు చేసినట్టు వెల్లడించింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో బ్యాంక్‌ రూ.343 కోట్ల నికర లాభాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆస్తుల పరంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నాలుగో అతిపెద్ద లెండర్‌. డైమండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీ, ఆయన మేనమామ మెహుల్‌ చోక్సిలు ఈ బ్యాంకులో భారీగా రూ.13,417 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. 

ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చాక వెల్లడించిన క్వార్టర్‌ ఫలితాల్లో కూడా బ్యాంక్‌ భారీగా నష్టాలను నమోదు చేసింది. వరుసగా ఈ క్వార్టర్‌లో కూడా పీఎన్‌బీ నష్టాలనే నమోదు చేసింది. బ్యాంక్‌ మొత్తం ఆదాయాలు రూ.15,072 కోట్లగా ఉన్నట్టు పీఎన్‌బీ తన క్వార్టర్‌ ఫలితాల్లో తెలిపింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఈ ఆదాయాలు రూ.14,468.14 కోట్లగా ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయాలు ఏడాది ఏడాదికి 22 శాతం పెరిగి రూ.4,692 కోట్లగా నమోదయ్యాయి. సీక్వెన్షియల్‌గా 53 శాతం పెరిగి రూ.3,063.3 కోట్లగా రికార్డయ్యాయి. 

మొత్తం రుణాల్లో బ్యాంక్‌ స్థూల ఎన్‌పీఏలు 18.26 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు కూడా 10.58 శాతానికి తగ్గాయి. బ్యాంక్‌ రుణ వృద్ధి జూన్‌ ముగిసే నాటికి సుమారు 4 శాతం పెరిగి రూ.4.15 లక్షల కోట్లగా నమోదయ్యాయని పీఎన్‌బీ చెప్పింది. డిపాజిట్‌ వృద్ధి ఫ్లాట్‌గా రూ.6.30 లక్షల కోట్లగా మాత్రమే నమోదైంది. ఫలితాల ప్రకటన అనంతరం బ్యాంక్‌ షేర్లు 2.16 శాతం కిందకి పడిపోయాయి.

పీఎన్‌బీలో చోటు చేసుకున్న కుంభకోణం దేశీయ బ్యాంకింగ్‌ చరిత్రలోనే అతిపెద్దది. గత కొన్నేళ్లుగా ముంబై బ్రాంచులో పీఎన్‌బీ స్టాఫ్‌ను ఉపయోగించుకుని నకిలీ గ్యారెంటీలతో విదేశాల్లో రూ.13,000 కోట్లకు పైగా నగదును నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సిలు అక్రమంగా పొందారు. 
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా