వడ్డీ లేని రుణానికి క్యూ!

11 Apr, 2018 00:37 IST|Sakshi

అంతకంతకూ విస్తరిస్తున్న మార్కెట్‌

కంపెనీలతో జత కట్టి రుణాలిస్తున్న బ్యాంకులు

మార్కెట్‌ను చూసి ముందుకొస్తున్న ఎన్‌బీఎఫ్‌సీలు

ఈ పద్ధతిలో కొనుగోళ్లకు వినియోగదారులూ సై

డీమోనిన్యూఢిల్లీ: వడ్డీ ఉండదు. అసలు మొత్తాన్నే నెలసరి వాయిదాల్లో చెల్లించొచ్చు. ఇదే... నో కాస్ట్‌ ఈఎంఐ. ఇపుడు ఎంత ఖరీదైన వస్తువైనా ఈ ‘నో కాస్ట్‌ ఈఎంఐ’ సదుపాయంతో కొనుగోలు చేసే ధోరణి పెరిగిపోతోంది. దీంతో ఈ మార్కెట్‌ రోజురోజుకీ విస్తరిస్తోంది. పెద్ద నోట్ల రద్దుకు ముందు మొత్తం అమ్మకాల్లో నోకాస్ట్‌ ఈఎంఐపై వైట్‌ గూడ్స్‌ (రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు, ఏసీలు తదితర ఉత్పత్తులు) విక్రయాలు 25 శాతంగా ఉంటే,  ప్రస్తుతం అవి 40 శాతానికి చేరాయి.

ఈ మార్కెట్‌ ఎంత శరవేగంగా వృద్ధి చెందుతుందో చెప్పటానికి ఈ గణాంకాలు చాలు. అందుకే ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హోమ్‌ క్రెడిట్‌ ఇండియా, టీవీఎస్‌ గ్రూపు ఈ మార్కెట్‌ అవకాశాలను అందుకునేందుకు చొరవ చూపిస్తున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ ఈ మార్కెట్లో లీడర్‌గా ఉంది. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో 25 శాతం ఫైనాన్స్‌పైనే జరుగుతుండడం వినియోగదారుల ఆసక్తిని తెలియజేస్తోంది.

డీమోనిటైజేషన్‌కు ముందు ఇది 10 శాతమే. దేశీయ వైట్‌గూడ్స్, స్మార్ట్‌ఫోన్ల మొత్తం మార్కెట్‌ విలువ ప్రస్తుతం రూ.1.5 లక్షల కోట్లుగా ఉంటుందని, ఏటా ఇది 10 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని అంచనా. డీమోనిటైజేషన్‌ తర్వాత వినియోగదారుల ఆలోచనలు మారాయని, నగదు రహిత లావాదేవీలు పెరిగాయని గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌ కమల్‌నంది తెలిపారు. వ్యవస్థీకృత రంగంలోని కంపెనీలు టైర్‌–2, టైర్‌–3 పట్టణాల్లోకి చొచ్చుకుపోవడంతో ఫైనాన్స్‌ పథకాల విస్తరణ పెరిగిందన్నారు.

పోటీ పడుతున్న కంపెనీలు  
ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు తమ సబ్సిడరీల ద్వారా సున్నా వడ్డీ రుణ పథకాలను ఆఫర్‌ చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అనుబంధ హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, టీవీఎస్‌ గ్రూపులు ఇప్పటికే డ్యురబుల్స్, స్మార్ట్‌ఫోన్ల ఫైనాన్స్‌ మార్కెట్లో పాతుకుపోయే ప్రయత్నాల్లో ఉన్నాయి.  బ్యాంకుల పరిధిలోని వైట్‌గూడ్స్‌ ఫైనాన్స్‌ మార్కెట్‌ 2017లో రూ.18,400 కోట్లకు పరిమితం కావడం గమనార్హం. దీంతో ఈ మార్కెట్లో ఉన్న భారీ అవకాశాలు ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.

హోమ్‌ క్రెడిట్‌ సంస్థ ఎల్‌జీ, శామ్‌సంగ్‌తో కస్టమర్లకు సున్నా వడ్డీకి రుణాలిచ్చేందుకు సంప్రదింపులు జరుపుతోంది. ‘‘కొత్త కస్టమర్లే మా లక్ష్యం. నగదు రహిత లావాదేవీలు మాకు పెద్ద అవకాశం’’ అని హోమ్‌ క్రెడిట్‌ ఇండియా చీఫ్‌ సేల్స్‌ ఆఫీసర్‌ ఆర్టెమ్‌ పొపోవ్‌ తెలిపారు. ఇప్పటికే ఈ సంస్థ సోనీ, ఇంటెక్స్‌ కంపెనీలతో టైఅప్‌ అయి సున్నా వడ్డీ రుణాలను ఆఫర్‌ చేస్తోంది.

మెట్రోల్లో అధికం 
మెట్రోల్లో మొత్తం జరిగే కన్జ్యూమర్‌ ఉత్పత్తుల విక్రయాల్లో ఫైనాన్స్‌పై జరిగేవి 60 శాతానికి చేరినట్టు ముంబై కేంద్రంగా పనిచేసే ఎలక్ట్రానిక్‌ చెయిన్‌ సంస్థ విజయ్‌సేల్స్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ నీలేశ్‌ గుప్తా తెలిపారు. పెద్ద పట్టణాల్లో రానున్న కాలంలో మొత్తం విక్రయాల్లో ఫైనాన్స్‌ మార్కెట్‌ 70–75 శాతానికి వృద్ధి చెందగలదన్నారు.

పలు బ్యాంకులు డ్యురబుల్, ఎలక్ట్రానిక్స్‌ ఫైనాన్స్‌లోకి ప్రవేశిస్తున్నాయని, రుణ జారీ ప్రక్రియ అంతా ఆటోమేషన్‌ చేయడంతో వినియోగదారులు ఈ పథకాలను ఎంచుకోవడం సులభంగా మారిందని రిలయన్స్‌ డిజిటల్‌ సీఈవో బ్రియాన్‌ బేడ్‌ తెలిపారు.   

>
మరిన్ని వార్తలు