7 Years Of Demonetisation: నోట్ల రద్దు తర్వాత రెట్టింపైన నగదు చలామణి! కారణం ఇదేనా..

8 Nov, 2023 10:22 IST|Sakshi

దేశంలో పెద్దనోట్లు రద్దయ్యి ఏడేళ్లు అవుతోంది. యూపీఐతోపాటు అనేక ఇతర డిజిటల్‌ పేమెంట్‌ పద్దతులూ అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పుల ఫలితంగా దేశంలో డిజిటల్‌ చెల్లింపులు పెరిగి ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ... పెరక్కపోవడం మాట అటుంచండి.. ఆర్థిక వ్యవస్థలో నగదు చెల్లింపులు పెద్ద నోట్ల రద్దుకు ముందు కంటే రెట్టింపు అయినట్లు తాజాగా నిర్వహించిన సర్వే ఒకటి చెబుతోంది. ఎందుకిలా? 

పెద్దనోట్ల రద్దు తరువాత నగదు లావాదేవీలు యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపు విధానాల ద్వారా జరుగుతూండటం వాస్తవమే. ఏటీఎంలలోనూ చాలా పరిమిత స్థాయిలోనే నగదు లభ్యమవుతోంది. సామాన్యులకు క్యాష్‌ దొరకడమే కష్‌టమవుతోంది. కానీ.. ఆర్థిక వ్యవస్థలో చెలామణిలో ఉన్న నగదు మాత్రం పెద్దరోట్ల రద్దుకు ముందుకంటే డబుల్‌ అయింది. పైగా ఈ ఏడేళ్లలో ఆస్తుల కొనుగోళ్లలో నగదు లావాదేవీలు 76 శాతం వరకూ ఉన్నట్లు ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన సర్వే ఒకటి తెలిపింది. 

దేశంలో మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 78 శాతం యూపీఐ ద్వారానే చేస్తున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ఇది 90 శాతానికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ద్వారా ప్రజలను డిజిటల్ లావాదేవీల దిశగా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు. 

అయితే, యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపు విధానాలు నగదు లావాదేవీలను తగ్గించగా, భారత ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న నగదు నవంబర్ 2016లో రూ.17 లక్షల కోట్ల నుంచి అక్టోబర్ 2023 నాటికి రూ.33 లక్షల కోట్లకు పెరిగిందని సర్వే తెలిపింది. చిన్నచిన్న లావాదేవీలకు డబ్బు వినియోగించడం తక్కువైంది. కానీ ఆస్తుల కొనుగోలు వంటి భారీ లావాదేవీలకు మాత్రం నగదును ఎక్కువగా వాడుతున్నారు. రెండేళ్ల క్రితం ఆస్తుల లావాదేవీల్లో నగదు అవసరం లేదని 30 శాతం మంది తెలిపారని, కానీ ప్రస్తుతం వారి సంఖ్య 24 శాతానికి పడిపోయినట్లు సర్వేలో తేలింది. అయితే కొంతమంది మాత్రం వాహనమైనా లేదా గాడ్జెట్‌ అయినా అధిక విలువ కలిగిన గృహోపకరణాల కొనుగోళ్లు డిజిటల్‌గా చేస్తున్నారని చెప్పింది. అయినప్పటికీ, చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ కిరాణా సామగ్రి, ఫుడ్ డెలివరీ, ఇంటి మరమ్మతులు, వ్యక్తిగత ఖర్చులు..వంటివి చెల్లించడానికి నగదును ఉపయోగిస్తున్నారని సర్వేలో తెలిపారు.

ఇదీ చదవండి: అందుకే తన కంపెనీని అమ్మేసిన రానా..

నవంబర్ 2016లో ప్రకటించిన నోట్ల రద్దు నల్లధనాన్ని వెలికితీయడానికి, నగదు చెల్లింపునకు బదులు ప్రజలను డిజిటల్‌ లావాదేవీలు చేసేలా ప్రోత్సహించడానికి చేపట్టారు.
 

మరిన్ని వార్తలు