నకిలీ వార్తలకు చెక్ చెప్పిన రతన్ టాటా

11 Apr, 2020 13:34 IST|Sakshi
పారిశ్రామికవేత్త రతన్ టాటా ( ఫైల్ ఫోటో)

ఆ పోస్ట్  నేను చెప్పింది కాదు, రాసింది అంతకన్నా కాదు

నకిలీ వార్తలపట్ల  అప్రతమత్తంగా వుండండి

సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యుల నుంచి ప్రముఖులు, సెలబ్రిటీల దాకా సోషల్ మీడియాలో నకిలీ వార్తల బెడద  పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా కరోనా విస్తరిస్తున్న వేళ ఇది మరింత పెరిగింది. తాజాగా  ప్రముఖ పారిశ్రామిక వేత్త , టాటా ట్రస్ట్ ఛైర్మన్ రతన్ టాటా ఈ ఫేక్ న్యూస్ బారిన పడ్డారు. దీంతో స్వయంగా ఆయనే ట్విటర్ ద్వారా నకిలీ వార్తపై స్పందించారు. దేశ ఆర్ధిక వ్యవస్థ గురించి తాను చెప్పినట్టు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తకు, తనకు సంబంధం లేదని  రతన్ టాటా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం  ట్వీట్ చేశారు.

ఆ పోస్ట్ నేను రాయలేదు..చెప్పలేదు. వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతున్నవార్తల పట్ల నిజానిజాలు తెలుసుకోవాలని రతన్ టాటా కోరారు. ఏదైనా అంశంపై అభిప్రాయాన్ని చెప్పదల్చుకుంటే తానే అధికారికంగానే చెబుతానని వెల్లడించారు. నకిలీ వార్తలు, సమాచారం పట్ల ప్రమత్తంగా వుండాలని సూచించారు. అందరూ క్షేమంగా, జాగ్రత్తగా ఉండాలని రతన్ టాటా ఆకాంక్షించారు.  కరోనా సంక్షోభ సమయంలో భారత ఆర్థికవ్యవస్థ ప్రభావంపై రతన్ టాటా వ్యాఖ్యల పేరుతో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఈ వ్యాఖ్యలు తనవి కావంటూ స్వయంగా రతన్ టాటా  నకిలీ వార్తలకు ముగింపు పలికారు.

మరిన్ని వార్తలు