నాపై విమర్శలు హేయం

11 Aug, 2016 01:02 IST|Sakshi
నాపై విమర్శలు హేయం

ఆర్‌బీఐ గవర్నర్ రాజన్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్... తనపై వస్తున్న ఆరోపణలను హేయమైనవిగా పేర్కొన్నారు. దురుద్దేశాలతో చేసిన ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్నారు. ఇలాంటి ఆరోపణల్ని తాను పట్టించుకోలేవటం లేదని స్పష్టంచేశారు. దేశం కోసం మూడేళ్లుగా తాను చేయాల్సిందంతా చేశానన్నారు. పరిష్కరించకుండా మిగిలిన అంశం... బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య మాత్రమేనన్నారు. పూర్తి సంతృప్తిగా, చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహించిన తాను ఈ మేరకు సంతోషంగా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా సెప్టెంబర్ 4వ తేదీన పదవీ విరమణ చేస్తున్న రాజన్ ఒక బిజినెస్ చానెల్‌తో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

 పునర్‌నియామకంపై ఇలా...
మూడేళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత, మరో మూడేళ్లు బాధ్యతల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ చర్చల ప్రక్రియ ఏదీ ఒక పరిపక్వ దశకు రాలేదు. అయితే పునర్‌నియామకం గురించి కానీ, లేదా ప్రభుత్వంలో నా కెరియర్ విషయంపై కానీ నేనెప్పుడూ ఆందోళన చెందలేదు. మిగిలిన పని చాలా ఉందని నేను చెప్పాను. దీనర్థం మరోసారి పదవీ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమని కాదు.

 మంచి టీమ్ ప్లేయర్‌గా...
నా పదవీ కాలంలో దేశం కోసం చేయాల్సిందంతా చేశాను. నేను ఈ విషయంలో ఒక అత్యుత్తమ టీమ్ ప్లేయర్‌ని.  నేను చేపట్టిన పనిలో 90 నుంచి 95 శాతం పూర్తిచేశా. నా కార్యకలాపాల నిర్వహణలో  పూర్తి స్వేచ్ఛగా ఉన్నా. ప్రభుత్వంతో పలు విషయాల్లో పోరాడాల్సి వచ్చిందన్న కొందరి భావన పూర్తి అవాస్తవం. గత ప్రభుత్వంతో, ప్రస్తుత ప్రభుత్వంలోని వ్యక్తులతో నాకు మంచి సంబంధాలున్నాయి.

భవిష్యత్ గురించి...
నేను పదేపదే చెప్పేదేమంటే, స్వభావ సిద్ధంగా నేను అధ్యాపకుడిని. ఆర్‌బీఐ గవర్నర్ బాధ్యతలు ఒక పార్శ్వం మాత్రమే.  పదవీ విరమణ తర్వాత ఏం చేయాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. 

 వ్యవస్థాగత సంస్కరణలు అవసరం
దేశం పటిష్ట, సుస్థిర వృద్ధి సాధించడానికి వేదికగా వ్యవస్థాగత సంస్కరణలు అవసరం. అలాగే నేను ద్రవ్యోల్బణంపై అధిక దృష్టి సారించానన్న విమర్శలు ఉన్నాయి. కానీ ఈ విషయంలో నేను ప్రభుత్వానికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. ఇది చాలా కీలకమైన అంశం. దేశంలో డిమాండ్ వృద్ధి చెదంటానికి ద్రవ్యోల్బణం కట్టడి చాలా అవసరం. దీనిపై ఆర్‌బీఐ, ప్రభుత్వం అత్యధిక దృష్టి సారించాలి.

మరిన్ని వార్తలు