డిజిటల్‌ రూపాయి లావాదేవీలు.. ఎస్‌బీఐ ముందడుగు

6 Nov, 2023 21:56 IST|Sakshi

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ప్రాజెక్ట్‌లో భాగంగా పలు బ్యాంకులు డిజిటల్ రూపాయితో యూపీఐ ఇంటర్‌ఆపరబిలిటీ ఫీచర్‌ను ప్రవేశపెట్టాయి. వీటిలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ ముందడుగు వేస్తోంది.

ఆర్బీఐ తీసుకొచ్చిన సీబీడీసీ ప్రాజెక్ట్‌లో భాగస్వాములు కావాలని ఎస్‌బీఐ తమ కస్టమర్లను ఆహ్వానిస్తోంది. తాజాగా ఈమేరకు ఎంపిక కస్టమర్లకు సందేశాలు పంపుతోంది. ఈ-రూపాయికి చట్టబద్ధమైన చెల్లుబాటు ఉందని, సాధారణ కరెన్సీ లాగే డిజిటల్‌ రూపాయితోనూ సురక్షితంగా లావాదేవీలు చేయొచ్చని పేర్కొంది.

ఈ ఫీచర్‌ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ‘ఈ-రూపీ బై ఎస్‌బీఐ’ యాప్‌ అనే యాప్‌ను తీసుకొచ్చింది. ఈ-రూపీ లావాదేవీల కోసం ఎస్‌బీఐ సీబీడీసీ కస్టమర్లు ఏదైనా మర్చంట్ యూపీఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చని ఎస్‌బీఐ ప్రకటించింది. ‘ఈ-రూపీ బై ఎస్‌బీఐ’ ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లోనూ, ఐఫోన్‌ యూజర్ల కోసం ఆపిల్‌ యాప్‌ స్టోర్‌లోనూ అందుబాటులో ఉందని, అక్కడి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరింది.

సీబీడీసీ గురించి..
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) పైలట్ ప్రోగ్రామ్‌ను ఆర్బీఐ 2022లో ప్రారంభించింది. ఈ సీబీడీసీని డిజిటల్ రూపాయి అని కూడా అంటారు. ఆర్బీఐ జారీ చేసే, నియంత్రించే కరెన్సీకి ఇది టోకనైజ్డ్‌ డిజిటల్‌ వర్షన్‌.

మరిన్ని వార్తలు