కోలుకుంటున్న ఉక్కు పరిశ్రమ

9 May, 2017 01:01 IST|Sakshi
కోలుకుంటున్న ఉక్కు పరిశ్రమ

బీకే స్టీల్‌ డైరెక్టర్‌ మనవ్‌ బన్సాల్‌
సాక్షి, అమరావతి: గత కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న ఉక్కు పరిశ్రమ క్రమేపీ కోలుకుంటోందని, ఈ ఏడాది స్టీల్‌ డిమాండ్‌లో 8–10 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు కోల్‌కతాకు చెందిన బీకే స్టీల్‌ డైరెక్టర్‌ మనవ్‌ బన్సాల్‌ తెలిపారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన బన్సాల్‌ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ మూడు నెలల నుంచి ఇండియాలో ఉక్కు అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి కనపడుతోందన్నారు.

దిగుమతులపై ఆంక్షలు విధించడం, ప్రభుత్వ పనులకు మేకిన్‌ ఇండియా స్టీల్‌ వినియోగాన్ని తప్పనిసరి చేయడంతో పాటు పరిశ్రమ క్రమేపీ కోలుకుంటోందన్నారు. 2016లో దేశంలో 84 మిలియన్‌ టన్నుల ఉక్కు వినియోగం కాగా అది ఈ ఏడాది 89 మిలియన్‌ టన్నులకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన ఉక్కు పాలసీ ఆశాజనకంగా ఉందని, ఉక్కు వినియోగం 2020 నాటికి 120 మిలియన్‌ టన్నులు, 2030 నాటికి 200 మిలియన్‌ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. గతేడాది ధరలు 15% పెరగడంతో పరిశ్రమ కోలుకుంటోందన్నారు.

ఏపీపై ప్రత్యేక దృష్టి: రాజధాని అమరావతి నిర్మాణంతో రాష్ట్రంలో ఉక్కు వినియోగం బాగా పెరిగే అవకాశం ఉందని బన్సాల్‌ పేర్కొన్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు ఆయన తెలిపారు.  బీకేస్టీల్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల టన్నులు కాగా ప్రస్తుతం అందులో సగం 1.50 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 1.80 లక్షల టన్నులకు ఉత్పత్తిని పెంచడమే కాకుండా రెండేళ్లలో పూర్తిస్థాయి ఉత్పత్తిని చేరుకోగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.గతేడాది బీకే స్టీల్‌ మొత్తం అమ్మకాలు రూ. 780 కోట్లు ఉండగా, అది  ఈ సంవత్సరం రూ. 850 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు