కాకినాడ సెజ్‌లో రూ.40 వేల కోట్లతో రిఫైనరీ

18 Sep, 2014 01:43 IST|Sakshi
కాకినాడ సెజ్‌లో రూ.40 వేల కోట్లతో రిఫైనరీ

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కేఎస్‌ఈజెడ్)లో భారీ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కానుంది. తునికి సమీపాన సముద్రతీరంలో రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల భారీ పెట్టుబడితో దీని ఏర్పాటుకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ముందుకు వచ్చింది. తూర్పు తీరంలో పారిశ్రామిక ప్రగతితో పాటు స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయనే ముందుచూపుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోర్టు ఆధారిత ఎస్‌ఈజెడ్ ప్రతిపాదనకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 2005లో ఆమోదింపజేశారు.

భూ సేకరణ కొలిక్కి వస్తున్న సమయంలో ఆయన హఠాన్మరణం చెందారు. దాంతో కేఎస్‌ఈజెడ్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయింది. అప్పట్లో దేశవ్యాప్తంగా కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లిన 67 ప్రత్యేక ఆర్థిక మండళ్లలో 36 మండళ్లకు ఆమోదం లభించగా అందులో పోర్టు ఆధారితమైనది కాకినాడ ఎస్‌ఈజెడ్ ఒక్కటే. ఎట్టకేలకు కేఎస్‌ఈజెడ్‌లో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఒక ప్రతినిధి బృందం ఇటీవల అక్కడి భూములను పరిశీలించింది.

ఈ సెజ్‌లో జీఎంఆర్ పోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, పోర్టుకు ప్రతిపాదిత రిఫైనరీకి ఎంత దూరం ఉంటుంది, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థ తదితర విషయాలన్నింటినీ ఆ బృందం పరిశీలించింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ఆయిల్ రిఫైనరీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శర్మ ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన నలుగురు జనరల్ మేనేజర్‌లు ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఈ బృందం తొలుత విశాఖ జిల్లా నక్కపల్లిలో ప్రతిపాదిత ఎస్‌ఈజెడ్ ప్రాంతాన్ని పరిశీలించింది.

నక్కపల్లి కంటే అనువైన భూములు ఉండడం, తొండంగి సమీపాన జీఎంఆర్ పోర్టు అందుబాటులోకి రానుండటంతో భారీ యంత్ర పరికరాల దిగుమతికి, తక్కువ ఖర్చుతో విదేశాలకు చమురు, సహజవాయువు ఎగుమతికి వీలుంటుందనే ఉద్దేశంతో ఈ బృందం కాకినాడ సెజ్ వైపే మొగ్గు చూపిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉప్పాడ, కాకినాడ తదితర ప్రాంతాలను పరిశీలించిన బృందం తొండంగి మండలం పెరుమాళ్లపురం-చోడిపల్లిపేట మధ్య తలపంటిపేటలో సుమారు 5,300 ఎకరాల్లో రిఫైనరీ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తొలి దశలో ఏడాదికి 15 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రిఫైనరీ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. రిఫైనరీలో ముడిచమురు శుద్ధి అయ్యాక డీజిల్, పెట్రోలు, ఆయిల్, గ్రీజ్ వంటి ఉప ఉత్పత్తుల మార్కెటింగ్‌కు కూడా కాకినాడతీరం కేంద్రం కానుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా