రూపాయికి 'క్యాడ్' జోష్..

7 Mar, 2014 04:04 IST|Sakshi
రూపాయికి 'క్యాడ్' జోష్..

ముంబై: స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను తాకడం, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) భారీగా దిగిరావడంతో దేశీ కరెన్సీకి బలాన్నిచ్చింది. గురువారం డాలరుతో రూపాయి మారకం విలువ 64 పైసలు(1.04%) ఎగబాకి 61.11 వద్ద స్థిరపడింది. ఇది దాదాపు 3 నెలల గరిష్టస్థాయి (గతేడాది డిసెంబర్ 10న 61.04 వద్ద ముగింపు) కావడం గమనార్హం. గతేడాది నవంబర్ 18న రూపాయి 70 పైసలు ఎగబాకగా, మళ్లీ ఒకేరోజు ఇంత భారీగా పుంజుకోవడం ఇదే తొలిసారి.

 ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం డిసెంబర్ క్వార్టర్‌లో జీడీపీతో పోలిస్తే క్యాడ్ 0.9 శాతానికి(4.2 బిలియన్ డాలర్లు) కట్టడి కావడం తెలిసిందే. ప్రధానంగా ఎగుమతుల వృద్ధి బాట, బంగారం దిగుమతులు భారీగా తగ్గడం వంటివి క్యాడ్‌కు కళ్లెంపడటంతో ప్రధాన కారకాలుగా నిలిచాయి. దీంతో ప్రస్తుత 2013-14 పూర్తి ఏడాదికి క్యాడ్ 45 బిలియన్ డాలర్లలోపే(2.5 శాతం దిగువన) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, గురువారం దేశీ ప్రధాన స్టాక్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కొత్త ఆల్‌టైమ్ గరిష్టస్థాయిల్లో ముగిశాయి.

సెన్సెక్స్ అయితే ఇంట్రాడేలో చరిత్రాత్మక రికార్డును నమోదు చేసింది కూడా. మార్కెట్ పరుగుతో పాటు విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండటం; ఎగుమతిదారులు, కొన్ని బ్యాంకులు సైతం డాలర్ల విక్రయాల బాటపట్టడం కూడా రూపాయి బలపడేందుకు దోహదం చేసిందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. గడిచిన ఎనిమిది సెషన్లలో(మార్చి 4 వరకూ) విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) దేశీ మార్కెట్లోకి ఏకంగా 80 కోట్ల డాలర్లను(దాదాపు రూ. 5,000 కోట్లు) కుమ్మరించడం విశేషం.
 
నింగినంటిన సూచీలు... కొత్త రికార్డుల మోత
పలు సానుకూల అంశాల నేపథ్యంలో దేశీ స్టాక్ సూచీలు మళ్లీ కదంతొక్కాయి. సెన్సెక్స్ 237 పాయింట్లు ఎగసి 21,514 వద్ద ముగిసింది. 72 పాయింట్లు జంప్ చేసిన నిఫ్టీ 6,401 వద్ద నిలిచింది. ఫలితంగా 2013 డిసెంబర్ 9న సెన్సెక్స్ సాధించిన ఇంట్రాడే గరిష్టం 21,484 పాయింట్లు పాతబడిపోగా, జనవరి 21న నమోదైన 21,374 పాయింట్ల రికార్డు ముగింపు మారిపోయింది. ఇక డిసెంబర్ 9న 6,364 వద్ద ముగిసిన నిఫ్టీ రికార్డు కూడా చెరిగిపోయింది. కాగా, అదే రోజు ఇంట్రాడేలో 6,415 పాయింట్లను తాకి సృష్టించిన  నిఫ్టీ రికార్డు మాత్రమే మిగిలిపోయింది!

 ఎన్ని‘కల’ జోష్
 సార్వత్రిక ఎన్నికల  తరువాత ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం సంస్కరణలకు ప్రాధాన్యమిస్తుందన్న అంచనాలు కొద్ది రోజులుగా విదేశీ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహమిస్తున్నాయి. దీంతో వరుసగా 14 రోజుల్లో రూ. 6,000 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌ఐఐలు గురువారం ఒక్క రోజులోనే రూ. 1,273 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే దేశీయ ఫండ్స్ యథావిధిగా రూ. 567 కోట్ల విలువైన అమ్మకాలను నిర్వహించాయి.

 ఇతర విశేషాలివీ....
 గురువారం ట్రేడింగ్‌లో రియల్టీ ఇండెక్స్ 4% జంప్‌చేయగా, పవర్, ఆయిల్, మెటల్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ 2% స్థాయిలో పుంజుకున్నాయి.

 సెన్సెక్స్ దిగ్గజాలు హిందాల్కో, భెల్, ఐసీఐసీఐ, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, గెయిల్, సెసాస్టెరిలైట్, కోల్ ఇండియా, హీరో మోటో, బజాజ్ ఆటో, ఆర్‌ఐఎల్, మారుతీ, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ 4-2% మధ్య లాభపడ్డాయి.

 రియల్టీలో ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 12% దూసుకెళ్లగా, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, డీఎల్‌ఎఫ్, యూనిటెక్, డీబీ, మహీంద్రా లైఫ్‌స్పేస్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 7-3 శాతం మధ్య ఎగబాకాయి.

స్వీడిష్ మాతృ సంస్థ డీలిస్టింగ్ యోచనను వాయిదా వేయడంతో ఆస్ట్రాజెనెకా 9%పైగా పతనంకాగా, మెరిల్‌లించ్ 2.35 లక్షలను కొన్న నేపథ్యంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ 5% పెరిగింది. గత 6 రోజుల్లో ఆస్ట్రాజెనెకా 50% ఎగసింది.

 మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు సైతం 1%పైగా బలపడ్డాయి. మిడ్ క్యాప్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రా, ఎస్‌ఆర్‌ఎఫ్ 20% దూసుకెళ్లగా, జైకార్ప్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, జేపీ అసోసియేట్స్, ఎస్‌కేఎస్, జేకే సిమెంట్, ఓరియంట్ సిమెంట్, వీగార్డ్, జేబీ కెమ్, స్పైస్‌జెట్, ఈరోస్, బాంబే డయింగ్, ఐఎల్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్ట్, కేఎస్‌కే ఎనర్జీ 12-6% మధ్య పురోగమించాయి.  
 
 లాభాల ‘మూడ్’..
 మూడు నెలల్లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంపై ఆశలు ఇన్వెస్టర్లలో జోష్‌ను నింపుతున్నాయి.
 
 మూడో క్వార్టర్ (అక్టోబర్-డిసెంబర్)లో కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) భారీగా క్షీణించి 4.2 బిలియన్ డాలర్లకు పరిమితంకావడం సెంటిమెంట్‌కు ఊపునిచ్చింది.
 
 డాలరుతో రూపాయి విలువ 3 నెలల గరిష్టమైన 61.11 కు చేరడం ఇందుకు సహకరించింది.
 
 వరుసగా 3వ రోజూ మార్కెట్లు పుంజుకున్నాయి. 3 రోజుల్లో సెన్సెక్స్ 567 పాయింట్లు ఎగసింది. 3 నెలల తరువాత దేశీ స్టాక్ సూచీలు కొత్త గరిష్ట స్థాయిలను అందుకున్నాయి.
 
 గత ఆరు పర్యాయాల్లో ఎన్నికల  ముందు నెలలో మార్కెట్లు ర్యాలీ చేయడం ఇది మూడోసారి!

మరిన్ని వార్తలు