స్వల్ప ఒడిదుడుకులు

15 Oct, 2014 01:01 IST|Sakshi
స్వల్ప ఒడిదుడుకులు

సెన్సెక్స్ 35 పాయింట్లు డౌన్
26,349 వద్ద ముగింపు
అమ్మకాల బాటలో ఎఫ్‌ఐఐలు

 
రోజు మొత్తం ఒడిదుడుకుల మధ్య సాగిన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 35 పాయింట్లు తగ్గి 26,349 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 20 పాయింట్లు క్షీణించి 7,864 వద్ద నిలిచింది. ఆర్‌ఐఎల్ ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు కొంతమేర సెంటిమెంట్‌కు బలాన్నిచ్చినప్పటికీ మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టిన ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారని నిపుణులు పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ల నుంచి మూడేళ్లపాటు నిషేధానికి గురైన డీఎల్‌ఎఫ్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో షేరు 28% పడిపోయింది. దీంతో బీఎస్‌ఈలో రియల్టీ ఇండెక్స్ 9% పతనమైంది. గత రెండు రోజుల్లో దాదాపు రూ. 1,400 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్‌ఐఐలు తాజాగా మరో రూ. 695 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

 భెల్ దూకుడు
 సెన్సెక్స్ దిగ్గజాలలో బీహెచ్‌ఈఎల్ 3.6% పుంజుకోగా, యాక్సిస్, బజాజ్ ఆటో, టాటా పవర్, హెచ్‌యూఎల్, భారతీ 2.5-1.5% మధ్య లాభపడ్డాయి. మరోవైపు టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ, ఐటీసీ, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ 1.5-0.5% మధ్య తిరోగమించాయి.
 
నేడు మార్కెట్లకు సెలవు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా బుధవారం(15న) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. ఫారెక్స్, మనీ మార్కెట్లు సైతం పనిచేయవు.

>
మరిన్ని వార్తలు