సరిహద్దు దేశాల నుంచి ఎఫ్‌డీఐలు

5 Dec, 2023 05:04 IST|Sakshi

50 శాతం ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ: భూ సంబంధ సరిహద్దు దేశాల ద్వారా 2020 ఏప్రిల్‌ నుంచి 2023 సెప్టెంబర్‌ వరకూ రూ. లక్ష కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రతిపాదనలు నమోదయ్యాయి. వీటిలో 50 శాతానికి ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర లభించింది. మిగిలిన సగం ప్రతిపాదనల్లో పెండింగ్‌ లేదా ఉపసంహరణ లేదా తిరస్కరణకు గురై ఉండవచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు.

కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా భూ సరిహద్దు దేశాల నుంచి లభించే ఎఫ్‌డీఐలకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తూ కేంద్రం 2020 ఏప్రిల్‌లో పత్రికా ప్రకటన విడుదల చేసింది. తద్వారా దేశీ కంపెనీల టేకోవర్‌ అవకాశాలకు చెక్‌ పెట్టింది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్‌లతో దేశానికి భూ సంబంధ సరిహద్దులున్న సంగతి తెలిసిందే. వెరసి ఈ దేశాల నుంచి తరలివచ్చే ఎఫ్‌డీఐల ద్వారా దేశీయంగా ఏ రంగంలోనైనా పెట్టుబడులు చేపట్టేందుకు అనుమతులు తప్పనిసరిగా మారాయి.

ఈ నిబంధనల తదుపరి రూ. లక్ష కోట్ల ప్రతిపాదనలురాగా.. 50 శాతం పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. భారీ మెషీనరీ తయారీ, ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ట్రేడింగ్, ఈకామర్స్, తేలికపాటి ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ విభాగాలలో అత్యధిక ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు నమోదయ్యాయి. సమీక్షా కాలంలో చైనా నుంచి 2.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఎఫ్‌డీఐ ఈక్విటీ ప్రతిపాదనలురాగా.. నేపాల్‌ నుంచి 4.5 మిలియన్‌ డాలర్లు, మయన్మార్‌ నుంచి 9 మిలియన్‌ డాలర్లు చొప్పున లభించాయి.

>
మరిన్ని వార్తలు