ప్రైవేటుకు అమూల్ సెగ!

3 Feb, 2015 13:09 IST|Sakshi
ప్రైవేటుకు అమూల్ సెగ!

హైదరాబాద్‌లో మొదలైన పాల యుద్ధం
తక్కువ ధరతో ప్రయివేటుకు సవాల్   
ధర, నాణ్యత ఆధారంగా అమూల్‌కు ఆదరణ
తెలంగాణ అంతటికీ విస్తరిస్తామన్న సంస్థ ఎండీ    
సొంత ప్రాసెసింగ్ ప్లాంటుకూ ప్రయత్నాలు
సాక్షి, బిజినెస్ విభాగం:
భారతదేశపు రుచి (టేస్ట్ ఆఫ్ ఇండియా) హవా హైదరాబాద్‌లోనూ మొదలైంది.

సరిగ్గా నెలరోజుల కిందట హైదరాబాద్ పాల మార్కెట్లోకి ప్రవేశించిన డెయిరీ దిగ్గజం ‘అమూల్’... రాష్ట్రంలోని ప్రైవేటు డెయిరీలకు చెమటలు పట్టిస్తోంది. ఏడాదికి దాదాపు రూ.20 వేల కోట్ల వ్యాపారం చేస్తున్న అమూల్ సామ్రాజ్యం విస్తరించింది రెండు సూత్రాలమీదే. ఒకటి... రైతులకు ఎక్కువ ధర చెల్లించి పాలు కొనటం. రెండు... వినియోగదారులకు తక్కువ ధరకే వాటిని అందించటం.హైదరాబాద్‌లో కూడా ఇదే అమలు చేయటంతో ప్రైవేటు డెయిరీలకు గుండెల్లో దడపుడుతోంది.  పాల సేకరణకు సంబంధించి తొలి విడతగా నల్లగొండ జిల్లా పాల ఉత్పత్తి దారుల సమాఖ్యతో (నార్మాక్) ఒప్పందం చేసుకున్న అమూల్... ఇతర ప్రాంతాల నుంచి కొన్ని పాలను తెచ్చి విక్రయిస్తోంది.

మెల్లగా ఇక్కడ సొంత ప్రాసెసింగ్ ప్లాంట్‌ను నెలకొల్పాలని, తెలంగాణ అంతటా పాల సేకరణ, విక్రయాలను విస్తరింపజేయాలని  చూస్తోంది. ప్రస్తుతం లీటరు రూ.38కే అందిస్తోంది. డీలర్లు లేకుండా వెండర్ల ద్వారా విక్రయాలు జరపటం, హోటళ్ల వంటి బల్క్ వినియోగదారులకు నేరుగా సరఫరా చేయటం వంటి వ్యూహాలతో అమ్మకాలు పెరుగుతున్నట్లు సమాచారం. ‘అమూల్’ విక్రయాలు జరపకుండా డీలర్లు, వెండర్ల ద్వారా కొన్ని ప్రైవేటు డెయిరీలు ఒత్తిళ్లు తెస్తున్నా... ధర, నాణ్యత, రుచి వంటి విషయాల్లో మెరుగ్గా ఉండటంతో అది కుదరటం లేదని సమాచారం. కొందరు వెండర్లను, వినియోగదార్లను ‘సాక్షి’ సంప్రదించినపుడు ఇది బయటపడింది.
 
అమూల్... పాల విప్లవం
అమూల్ ఏ ఒక్కరిదో కాదు. లక్షల మంది పాడి రైతులకు చెందిన 17 సహకార సంఘాలది. తమ నుంచి పాలు తీసుకుని ముంబైలో అమ్మే పాల్సన్ డైరీ... పలు అక్రమాలకు పాల్పడటంతో దాన్ని ఎదిరించడానికి గుజరాత్‌లోని ఖేడా రైతుల సంస్థ ఇది. అప్పట్లో వారంతా త్రిభువన్ దాస్ కె పటేల్ నాయకత్వాన ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌ను కలిశారు. ఓ సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి నేరుగా బొంబాయి మిల్క్ స్కీమ్‌కు పాలు సరఫరా చేయాలని ఆయన సూచించి... రైతుల్ని ఏకం చేసే బాధ్యతను మొరార్జీదేశాయ్‌కి అప్పగించారు.

అప్పట్లో పాల సేకరణను  వికేంద్రీకరించటంతో ఎక్కడికక్కడ చిన్న చిన్న సహకార సంఘాలు ఏర్పాడ్డాయి. వీటి  సభ్యులంతా రోజుకు ఒకటి, రెండు లీటర్లు సరఫరా చేసేవారే. 1946 డిసెంబర్ 1న అంతా కలసి ‘అమూల్’ను ఏర్పాటు చేశారు. అనంతరం దాన్ని హెచ్.ఎం.దలయాతో కలసి డాక్టర్ వర్గీస్ కురియన్, త్రిభువన్‌దాస్ పటేల్‌లు కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. ప్రపంచంలోనే తొలిసారిగా గేదె పాల నుంచి పాలపొడిని తయారుచేసే ఫార్ములాను దలయా కనిపెట్టగా... మార్కెటింగ్, బ్రాండ్ బిల్డింగ్‌పై సోదరుడు కె.ఎం.ఫిలిప్ చేసిన సూచనల్ని కురియన్ ఆచరించారు.

ఫలితంగా... ఆనంద్ జిల్లాలో ఏర్పడిన ఆధునిక డెయిరీ గుజరాత్‌లోని ఇతర జిల్లాలకూ విస్తరించింది. మెహసనా, బనస్కాంత, బరోడా, సబర్‌కాంత, సూరత్ జిల్లాలూ చేతులు కలిపాయి. అంతా కలసి 1973లో గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్యను (జీసీఎంఎంఎఫ్) ఏర్పాటు చేశారు. అంత వరకూ తన చేతిలో ఉన్న అమూల్ బ్రాండ్‌ను ఖేడా సంఘం జీసీఎంఎంఎఫ్‌కు బదలాయించింది. అలా... ఆధునిక అమూల్ ఆవిర్భవించింది.
 
ఇదీ... అమూల్ ఘనత
గుజరాత్‌లోని 17 సహకార సంఘాలు... వాటిలోని 32.3 లక్షల మంది రైతులు దీన్లో సభ్యులు.
దేశంలోని 50 ప్రాంతాల్లో సేల్స్ కార్యాలయాలు, 5వేల హోల్‌సేల్ డీలర్లు, 7 లక్షల మంది రిటైల్ డీలర్లు ఉన్నారు.
ప్రపంచంలో అతిపెద్ద శాకాహార వెన్న, ప్యాకెట్ మిల్క్ బ్రాండ్.
40కి పైగా దేశాల్లో లభించే అమూల్... దేశంలో అతిపెద్ద డెయిరీ ఎగుమతిదారు.
గత సంవత్సరం అమూల్ టర్నోవరు 3 బిలియన్ డాలర్లు. అంటే రూ.18 వేల కోట్లపైనే.
గత ఏడాది అమూల్ సేకరించిన పాలు 479 కోట్ల లీటర్లు.
 
వ్యాపారం పెరిగింది
నెల కిందట అమూల్ ప్రవేశించినపుడు నేను 500 లీటర్లతో మా ప్రాంతంలో అమ్మకాలు మొదలుపెట్టా. బాగుంటే చూద్దాం... లేకుంటే మానేద్దామని అనుకున్నా. ఇపుడు రోజుకు 2 వేల లీటర్లు తీసుకుంటున్నా. తక్కువ ధరతో పాటు కొన్నవారు ఇవి రుచిగా ఉన్నాయని కూడా చెబుతున్నారు. అందుకే డిమాండ్ పెరుగుతోంది. ఇంకా బిజినెస్ పెరుగుతుందనే నమ్మకం నాకుంది.
 - పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ వెండర్ (మెహిదీపట్నం, విజయనగర్ కాలనీ)
 
అమూల్ దారి... కురియన్ దారి
అమూల్ పాల విప్లవమైతే... దానికి పితామహుడు డాక్టర్ వర్ఘీస్ కురియన్. పాల కొరత దేశంగా ఉన్న భారత్‌ను పాలు ఎగుమతి చేసే దేశంగా... ప్రపంచ ఉత్పత్తిలో 17 శాతంతో ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తిదారుగా మార్చింది ఆయనే. అమూల్ వ్యవస్థాపక చైర్మన్‌గా ఉన్న కురియన్... దాంతో పాటు ఐఆర్‌ఎంఏ, ఎన్‌డీడీబీ వంటి 30 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను నిర్మించారు. ఇవన్నీ రైతుల ఆధ్వర్యంలోనే నడుస్తాయి.దేశంలోను, ఆ మోడల్ ద్వారా ప్రపంచంలోను అత్యధిక మందిని పేదరికం కోరల నుంచి తప్పించిన కురియన్‌ను... ప్రపంచ సహకార ఉద్యమ పితామహుడిగా పరిగణిస్తారు. రామన్ మెగసెసె, వరల్డ్ ఫుడ్ ప్రైజ్, పద్మ విభూషణ్ వంటి ఎన్నో పురస్కారాలను దక్కించుకున్న కురియన్... 90 ఏళ్ల వయసులో 2012లో కన్నుమూశారు.
 
తక్కువ లాభాల వల్లే తక్కువ ధర
ప్రస్తుతం మేం నల్లగొండ జిల్లా పాల ఉత్పత్తిదారుల సమాఖ్యతో ఒప్పందం చేసుకుని పాలు సేకరిస్తున్నాం. వాటిని హైదరాబాద్ మార్కెట్లో విక్రయిస్తున్నాం. కొన్ని పాలు ఇతర ప్రాంతాల నుంచి సరఫరా చేస్తున్నాం. సొంత ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టడంతో పాటు తెలంగాణ అంతటా పాల సేకరణను విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మా సంస్థ యజమానులంతా రైతులే. మా ఆదాయంలో మార్కెటింగ్‌కు వెచ్చిం చేది ఒక్క శాతమే. ప్రైవేటు డెయిరీలతో పోలిస్తే మూడోవంతు లాభాలకే పనిచేస్తాం. అందుకే పాల  రైతులకు ఎక్కువ ధర చెల్లించి, వినియోగదారులకు తక్కువ ధరకే పాలు అందించగలుగుతున్నాం.హైదరాబాద్‌లో మా బ్రాండ్‌కు ఆదరణ పెరుగుతోంది. పంపిణీ వ్యవస్థ సరిగాలేకపోవటం, దళారుల ప్రమేయం వల్లే హైదరాబాద్‌లో పాల ధర ఎక్కువ. దీన్ని సరిచేసి భారతదేశపు రుచిని హైదరాబాద్‌కు చూపిస్తాం. మాదీ సహకార డెయిరీనే కనుక  ఇదే రంగంలోని విజయ డెయిరీకి ఇబ్బంది రాకూడదని దాంతో సమానంగా ధర నిర్ణయించాం’.
- ‘సాక్షి’తో రూపిందర్ సింగ్ సోధీ, అమూల్ ఎండీ

మరిన్ని వార్తలు