ప్లానర్స్‌కు మోడల్ స్టేట్‌గా తెలంగాణ

5 Dec, 2015 02:17 IST|Sakshi
ప్లానర్స్‌కు మోడల్ స్టేట్‌గా తెలంగాణ

సీఐఐ సదస్సులో కేటీఆర్
 హైదరాబాద్:
రానున్న రోజుల్లో నిర్మాణ రంగ ప్లానర్ల్లకు మోడల్ స్టేట్‌గా తెలంగాణ నిలుస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో భాగంగా పట్టణీకరణతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అనుసంధానానికి భారీగా వ్యయం చేస్తున్నట్టు చెప్పారు. మౌలిక రంగంపై శుక్రవారమిక్కడ సీఐఐ ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్య అతిథిగా విచ్చేసి పారిశ్రామికవేత్తలను ఉద్ధేశించి మంత్రి ప్రసంగించారు. పారిశ్రామిక పార్కులు, విమానాశ్రయాలు, డ్రై పోర్టులతోపాటు సామాజిక మౌలిక వసతులైన విద్యుత్, నీరు, ఇల్లు, ప్రజా రవాణాపైనా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే ఇంటింటికీ నల్లాల ద్వారా మంచి నీటి సరఫరా ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకున్నామని వివరించారు.

 మరిన్ని పీపీపీ ప్రాజెక్టులు..
 ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో తెలంగాణలో మరిన్ని మౌలిక ప్రాజెక్టులు రావాలని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సీఈవో ఎస్‌జీకే కిశోర్ సూచించారు. ఏరోస్పేస్ రంగంలో మానవ వనరుల కొరతను తీర్చేందుకు శిక్షణ సంస్థ ఏర్పాటు అవసరమన్నారు. హైదరాబాద్‌తోసహా ఇతర ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని సీఐఐ తెలంగాణ శాఖ చైర్‌పర్సన్ వనిత దాట్ల అభిప్రాయపడ్డారు.

 శంషాబాద్ విమానాశ్రయం విస్తరణ...
 పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌ను జీఎంఆర్ విస్తరించనుంది. ఈ విస్తరణ పనులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనుంది. విస్తరణ పూర్తి అయితే వార్షిక సామర్థ్యం 1.2 కోట్ల నుంచి 2 కోట్ల ప్రయాణికులకు చేరనుందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సీఈవో ఎస్‌జీకే కిశోర్ వెల్లడించారు. 80 వేల టన్నులున్న కార్గో సామర్థ్యం 2016 మార్చికల్లా లక్ష టన్నులకు చేరుతుందని చెప్పారు. ప్రయాణికుల రద్దీ 2014-15లో ఒక కోటి కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 1.2 కోట్లుగా ఉండొచ్చని.. అయిదేళ్లలో 2 కోట్లను తాకుతుందని భావిస్తున్నామని అన్నారు. విస్తరణకు రూ.1,000 కోట్ల వ్యయం అయ్యే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు