బంగారం రికార్డు : రూ. 45 వేలను దాటేసింది

7 Apr, 2020 12:33 IST|Sakshi

సాక్షి, ముంబై: విశ్లేషకులు అంచనాలకు అనుగుణంగానే బంగారం నింగిని చూస్తోంది. భారతదేశంలో బంగారం ధరలు నేడు (మంగళవారం) 10 గ్రాములకు రూ. 2 వేల మేర పెరిగి రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాములకు రూ. 45,724 వద్ద రికార్డు గరిష్టాన్ని తాకింది. ఎంసీఎక్స్ లో జూన్ ఫ్యూచర్స్ 3.5 శాతం పెరిగి 45,269 స్థాయిని తాకింది. వెండి ధర ఎంసిఎక్స్ లో ఫ్యూచర్స్ నేడు 5శాతం పెరిగి కిలోకు, 43,345 కు చేరుకుంది. కమోడిటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ మార్కెట్లకు నిన్న సెలవు. బంగారం ధర ఒక్కరోజే 3 శాతం పెరిగి పసిడి రూ.45,000లకు చేరింది. శుక్రవారం మార్కెట్‌ ముగిసే సమయానికి 10 గ్రాముల పసిడి రూ.43,722 వద్ద వుంది. మంగళవారం దేశీయ మల్టీకమోడిటీ మార్కెట్‌లో రూ.1,403 పెరిగి 10 గ్రాముల పసిడి రూ. రూ.45,125 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుండడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకోవడంతో పసిడి ధర రూ.45 వేలను అధిగమించిందని ఆర్థిక నిపుణుల అంచనా. అయితే లాక్ డౌన్ అనిశ్చితి, డిమాండ్ కీణత, లాభాల స్వీకరణ వుంటుందంటూ అప్రమత్తతను సూచిస్తున్నారు.

ప్రపంచ మార్కెట్లలో కూడా పసిడి పరుగు కొనసాగుతోంది. కోవిడ్‌-19 బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న ఆందోళనల మధ్య  అంతర్జాతీయంగా కూడా బంగారం ధర  పెరిగింది. సోమవారం ఒక్కరోజే 2 శాతం పెరిగి ఔన్స్‌ బంగారం 1700 డాలర్లకు చేరింది. శుక్రవారంతో పోలిస్తే ఔన్స్‌ బంగారం 20 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,714.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వెండి 0.1 శాతం పెరిగి ఔన్స్14.99 డాలర్లకు చేరుకుంది. ఇతర విలువైన లోహాలలో ప్లాటినం 735.26 డాలర్ల వద్ద స్థిరంగా వుంది.

మరోవైపు అంతర్జాతీయ సానుకూల సంకేతాలను అందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరంభంలోనే 1300 పాయింట్లకు పైగా ఎగిసాయి.   అనంతరం ట్రేడర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్ 1575 పాయింట్లు ఎగిసి 29164 వద్ద, నిఫ్టీ 456 పాయింట్లు లాభంతో 8538 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంక్, ఫార్మ రంగ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు ఊతమిస్తున్నాయి. డాలరు మారకంలో  దేశీయ కరెన్సీ రూపాయి కూడా   సానుకూలంగా ట్రేడింగ్ ఆరంభించింది. 21 పైసలు ఎగిసిన 75.92 వద్ద కొనసాగుతోంది. కాగా కరోనావైరస్ ఆందోళనల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ సోమవారం చిన్న-వ్యాపారాలకు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. జపాన్ అపూర్వమైన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని అందించే యోచనలో వుంది. మరోపు లాక్ డౌన్ కారణంగా డిమాండ్ తగ్గడంతో బంగారం ధరలపై అప్రమత్తంగా వుండాలని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. (లాభాల కళ : బ్యాంక్స్ రీబౌండ్) (యూకేలో భారతీయ సంతతి వైద్యుడు మృతి)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు