ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు

24 Dec, 2014 01:07 IST|Sakshi
ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు

ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేసిన మొండి బకాయిల విలువ ఇది...
 
న్యూఢిల్లీ: గడచిన అయిదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీ) ఏకంగా రూ. 1,06,170 కోట్ల మేర రుణాలను మొండి బకాయిల కింద రద్దు చేశాయి. పునర్‌వ్యవస్థీకరించిన రుణాల మొత్తం గడచిన మూడేళ్లలో రెట్టింపయ్యాయి. 2011-12లో రూ. 20,752 కోట్లుగా ఉన్న ఈ మొత్తం .. ఈ ఏడాది మార్చి నాటికి రూ. 44,447 కోట్ల స్థాయికి చేరింది. మొండి బకాయిలు పెరగడానికి ఆర్థిక వ్యవస్థ మందగమనం తదితర అంశాలు కారణమయ్యాయి.

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా మంగళవారం రాజ్యసభకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, మార్చి 31 నాటి దాకా గణాంకాల ప్రకారం రూ. 25 లక్షలు పైగా బకాయిపడిన వారిలో 1,600 మందిని ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించినట్లు ఆయన వివరించారు. సమస్యను ముందుగానే గుర్తించేందుకు, సత్వరం దిద్దుబాటు..రికవరీకి చర్యలు తీసుకునేందుకు రుణాల పునర్‌వ్యవస్థీకరణ వంటి విధానాలు, లోక్ అదాలత్ వంటి వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని సిన్హా పేర్కొన్నారు.

అటు పోంజీ తరహా మోసపూరిత స్కీముల నిర్వాహకులను కఠినంగా శిక్షించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు సిన్హా తెలిపారు. సాధారణంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ (ఎంఎల్‌ఎం) లేదా ఉమ్మడి పెట్టుబడి పథకాలు(సీఐఎస్) రూపంలో ఇలాంటివి జరుగుతున్నట్లు ఆయన వివరించారు.  ఇటీవలి కాలంలో 55 కంపెనీలు సీఐఎస్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గుర్తించిందని ఆయన తెలిపారు. ఇన్వెస్టర్ల సొమ్ము వాపసు చేశాక, స్కీములను నిలిపివే యాలని 19 కేసుల్లో సెబీ తుది తీర్పునిచ్చింది.

>
మరిన్ని వార్తలు