లాక్‌డౌన్‌ గొడవ: మహిళను కాల్చి చంపిన జవాను!

2 Apr, 2020 15:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి గ్రామానికి వచ్చిన వలస జీవుల జాబితాలో తన పేరు, తన కుటుంబ సభ్యుల పేర్లు ఉండటంతో ఓ ఆర్మీ జవాను సహనం కోల్పోయాడు. ఈ క్రమంలో తలెత్తిన వివాదంలో ఓ మహిళను కాల్చి చంపేశాడు. వివరాలు... కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కరోనా మహమ్మారి భయంతో వలస జీవులు స్వస్థలాలకు పయనమవుతున్నారు. అయితే వీరి కారణంగా తమకు కూడా అంటువ్యాధి సోకుతుందని భావిస్తున్న గ్రామస్తులు.. ఊర్లోకి కొత్తగా వచ్చిన వారి సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్నారు. సదరు వ్యక్తులను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచిస్తున్నారు.(అక్కడ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చేస్తారంటే!)

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురిలో గల అలీపూర్‌ గ్రామ పెద్దలు ఈ వివరాలు సేకరించాల్సిందిగా వినయ్‌ యాదవ్‌ అనే వ్యక్తిని పురమాయించారు. ఈ క్రమంలో ఇటీవల కలకత్తా నుంచి తిరిగి వచ్చిన వారి జాబితాను అతడు అధికారులకు అందజేశాడు. అయితే అందులో తమ పేర్లను ఎందుకు చేర్చావంటూ జవాను శైలేంద్ర వినయ్‌తో గొడవకు దిగాడు. దీంతో ఓ మహిళ సహా మరో వ్యక్తి వినయ్‌కు అండగా నిలబడ్డారు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన శైలేంద్ర సదరు మహిళను తుపాకీతో కాల్చాడు. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. కాగా శైలేంద్ర చర్యను తీవ్రంగా పరిగణించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు