రాజాం ఆస్పత్రిలో పసికందు మృతి 

4 May, 2018 10:15 IST|Sakshi

డ్యూటీ డాక్టర్‌ గైర్హాజరు వైద్యం చేసిన నర్సులు

ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన బాధిత కుటుంబీకులు 

నిరసన డ్రామాకు తెరలేపిన నర్సులు

నవమాసాలు మోసి.. పండంటి బిడ్డను కళ్లారా చూడాలనుకున్న ఆ తల్లికి గర్భశోకమే మిగిలింది. పురిటిలోనే బిడ్డను కోల్పోవడంతో తల్లడిల్లిపోయింది. శిశువు మరణానికి ఆస్పత్రి వర్గాల నిర్లక్షమే కారణమంటూ బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు. నర్సులు సైతం నిరసనకు దిగి ఆశ్చర్య పరిచారు. ఈ సంఘటన రాజాం సామాజిక ఆస్పత్రి వద్ద గురువారం చోటుచేసుకుంది.

విజయనగరం, రాజాం సిటీ : రాజాం సామాజిక ఆస్పత్రికి విజయనగరం జిల్లా బలిజిపేట మండలం గళావళ్లి గ్రామానికి చెందిన గర్భిణి కింజంగి కల్యాణి ప్రసవం కోసం వచ్చి చేరింది. ఈమె అత్త వారు వంగర మండలం కొండచాకరాపల్లి కాగా గర్భిణి కావడంతో కన్నవారి ఇంటి వద్ద ఉండేది. నెలలు నిండడంతో కుటుంబీకులు ఆమెను బుధవారం రాజాం సామాజిక ఆస్పత్రికి తీసుకువచ్చారు. వివిధ పరీక్షలు, స్కానింగ్‌లు చేసిన సిబ్బంది డెలివరీకి సమయం ఉందంటూ నచ్చజెప్పి ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు.

అయితే కల్యాణికి వంట్లో నలతగా ఉండడంతో భయపడిన కుటుంబీకులు  ఆమెను ఆస్పత్రిలోనే ఉంచారు. బుధవారం రాత్రి 11 గంటల నుంచి కల్యాణికి నొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని చెప్పేందుకు డ్యూటీ డాక్టర్‌ సునీత కోసం కల్యాణి కుటుంబీకులు ఆరా తీశారు. అయితే ఆమె లేకపోవడంతో అక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేశారు. దీంతో డ్యూటీలో ఉన్న ఇద్దరు నర్సులు మందులు ఇచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే ఆ తరువాత కూడా కల్యాణికి నొప్పులు తగ్గకపోవడంతో ఇబ్బంది పడింది.

ఈ విషయాన్ని కూడా నర్సుల దృష్టికి కుటుంబీకులు తీసుకెళ్లారు. ఇదే సమయంలో కల్యాణకి రక్త స్రవం అధికం కావడంతో ఆందోళన చెందారు. వైద్యం అందించాలని నర్సులను వేడుకున్నారు. దీంతో గురువారం తెల్లవారు జామున నర్సులు కలుగజేసుకొని ప్రసవం జరిపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బిడ్డ చనిపోయింది. దీంతో కల్యాణి కుటుంబీకు ఆగ్రహానికి గురయ్యారు.

నొప్పులు అధికంగా ఉన్నాయని, బతిమిలాడుకున్నా డ్యూటీ డాక్టర్‌ రాలేదని, నర్సులే బలవంతంగా వైద్యం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కల్యాణి భర్త తిరుపతిరావు ఆరోపించారు. వేరే ఆస్పత్రికి వెళ్లి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని రోదించాడు. చేతులారా పండంటి  బిడ్డను కోల్పోయామని కన్నీరుమున్నీరుగా విలపించాడు.

ఆస్పత్రి వద్ద ఆందోళన 

విషయం తెలుసుకున్న కల్యాణి బంధువులు, కొండచాకరాపల్లి, గళావల్లి గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు గురువారం ఉదయం చేరుకున్నారు. కల్యానికి జరిగిన అన్యాయంపై ఆస్పత్రి వర్గాలను నిలదీశారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. 

రంగంలోకి సూపరింటెండెంట్‌...

 ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌నాయుడు బాధితరాలు కల్యాణి కుటుంబీలతో మాట్లాడారు. పూర్తి వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్‌ లేకపోవడం ఏమిటని, నర్సులు వైద్యం చేయడమేమిటని మండిపడ్డారు. గర్భిణులు, శిశువుల ప్రాణాలతో ఆస్పత్రి సిబ్బంది ఆడుకుంటున్నారని బాధిత కుటుంబీకులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని పట్టబట్టారు. ఆస్పత్రి సిబ్బందితో కూడా సూపరింటెండెంట్‌ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కల్యాణికి వైద్యం చేసిన నర్సులు మాట్లాడుతూ డ్యూటీ డాక్టర్‌  అందుబాటులో లేకపోవడంతోనే తామే వైద్యం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాన్పు కష్టంగా ఉండడంతో తమకు తెలిసిన పద్ధతిలో ప్రయత్నించామని.. అయితే దురదృష్టవశాత్తు బిడ్డ చనిపోయింది పేర్కొన్నారు.  సూపరింటెండెంట్‌ విలేకరులతో మాట్లాడుతూ మృతశిశువే జన్మించిందని..ఇందులో తమ సిబ్బంది తప్పులేదని స్పష్టం చేశారు.

 డ్యూటీ డాక్టర్‌ ఎక్కడ?

బుధవారం రాత్రి ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్‌ లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తమ బిడ్డకు బాగోలేదని సమాచారం అందించినా డాక్టర్‌ రాలేదని.. నర్స్‌లే మొత్తం డ్రామాలు ఆడారని బాధితులు వాపోయారు. సకాలంలో మెరుగైన వైద్యం అందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదికాదన్నారు.

నర్సుల నిరసన డ్రామా 

ఇదిలా ఉండగా తమపైకి ఆరోపణలు రావడంతో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సులంతా ఒక్కటయ్యారు. డాక్టర్లు అందుబాటులో ఉండడంలేదని, రాత్రి, పగలు మేమే సేవలందిస్తున్నామని మీడియా ఎదుట చెప్పుకొచ్చారు. కల్యాణకి కష్టపడి వైద్యం అందించామని.. అయితే బిడ్డ చనిపోవడం బాధాకరమన్నారు. తమను ఏమైనా అంటే ఊరుకునేది లేదంటూ నిరసన డ్రామాకు తెరలేపారు. ఈ విషయం చర్చనీయాంశమైంది.

భవిష్యత్‌లో డ్యూటీ డాక్టర్లు, సంబంధిత డాక్టర్లు ఉంటేనే రోగులకు సేవలందిస్తామని, లేకుంటే సేవలు చేయలేమని నర్సులంతా స్పష్టం చేశారు.విచారణ..శిశువు మృతిపై పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్యతోపాటు డీసీహెచ్‌ఎస్‌ సూర్యారావులు మెజిస్ట్రేటియల్‌ విచారణ జరిపారు. ముందుగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఎం సీహెచ్‌ నాయుడును, డ్యూటీ డాక్టర్‌ సునీతను, నర్సులు పద్మావతి, రమాదేవిలను రెండు గంటలపాటు విచారించారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, ఎంతటి వారైనా శిక్షార్హులేనని డీసీహెచ్‌ఎస్‌ సూర్యారావు విలేకరులకు తెలిపారు. 

మరిన్ని వార్తలు