మళ్లీ భల్లూకాల అలజడి

22 Jun, 2018 13:49 IST|Sakshi
 ఎలుగుదాడిలో తీవ్రంగా గాయపడిన గంగమ్మ   

నల్లబొడ్లూరులో మహిళపై దాడి

వ్యక్తికి త్రుటిలో తప్పిన ప్రమాదం

వరుస దాడులతో ఉద్దాన వాసుల ఉలికిపాటు

మందస : ఉద్దానం ప్రజలను ఎలుగుబంట్లు భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉన్నాయి. మండలంలోని ఎర్రముక్కాం, పాతపితాళిలలో భల్లూకం చేసిన బీభత్సం ఇంకా ప్రజల కళ్ల ముందు కదులుతూనే ఉంది. ఎర్రముక్కానికి చెందిన దంపతులు ఎలుగు దాడిలో దుర్మరణం చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి నేటికీ ఆందోళనకరంగానే ఉంది. దీని నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగానే గురువారం ఎలుగుబంట్లు బీభత్సం సృష్టించాయి. 

అరగంట వ్యవధిలోనే.. 

మందస మండలంలోని నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన బొడ్డు గంగమ్మ ఉదయం 5.30 గంటలకు తోటల్లోకి వెళ్తుంగా ఒక్కసారిగా భల్లూకం దాడి చేసింది. కుడిచేయిపై కొంత భాగాన్ని కొరికేసింది. గ్రామస్తులు గమనించి, కేకలు వేసి తరమడంతో ఎలుగు పారిపోయింది. వీరు వెంటనే 108కు సమాచారం ఇవ్వడంతో ఈఎంటీ తారకేశ్వరరావు, పైలట్‌ వెంకటరావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స చేశారు.

అనంతరం గంగమ్మను పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉదయం 6 గంటల సమయంలో సువర్ణాపురం గ్రామానికి చెందిన సాలీన భీమారావు తోటకు వెళ్తుండగా దారిలో ఎలుగుబంటి దాడి చేయడానికి ప్రయత్నించింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమీపంలోని చెట్టు ఎక్కారు. ఆ ప్రాంతంలో కొంతసేపు తిరిగిన ఎలుగుబంటి వెళ్లిపోవడంతో ఆయన బతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకున్నారు.

కేసుపురం సమీపంలోని జీడి, మామిడి తోటల్లో ఎలుగులు కనిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. తోటల్లోకి వెళ్లడానికి సాహసించలేకపోయారు. వరుస ఎలుగుబంట్లు దాడులతో ఉద్దాన ప్రాంత వాసులు హడలెత్తిపోతున్నారు. ప్రాణభయంతో రాత్రి వేళల్లో ఇంటి నుంచి రావడానికి భయపడుతున్నారు. ప్రాణనష్టంతో పాటు పెంచుకుంటున్న పశువులు, జంతువులను కూడా చంపివేస్తుండడంతో ఉద్దానవాసులు ఉలిక్కి పడుతున్నారు. 

దేవుడే రక్షించాడు: సాలీన భీమారావు

ఎప్పుడూ లేనిది ఉదయాన్నే తోటకు వెళ్లాను. దారిలో ఓ ఎలుగుబంటి కనిపించింది. దాడి చేయడానికి ప్రయత్నించగా, దగ్గర్లో ఉన్న చెట్టు అప్రయత్నంగా ఎక్కేశాను. ఈ సమయంలోనే మరో ఎలుగుబంటి కూడా వచ్చింది. ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ చెట్టుపైనే ఉన్నాను. కొద్దిసేపు ఎలుగులు కదల్లేదు. ఈలోగా గ్రామస్తులు వచ్చి తరమడంతో వెళ్లిపోయాయి. ఎలుగుల నుంచి దేవుడే కాపాడాడు.  

మరిన్ని వార్తలు