ఘరానా దొంగ ఆటకట్టు

13 Nov, 2018 10:12 IST|Sakshi
ఆభరణాలను పరిశీలిస్తున్న రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ నిందితులు అమీర్, తౌఫిక్‌

రెండు నెలల్లో.. ఆరు బైక్‌ చోరీలు..మూడు స్నాచింగ్‌లు

నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరి మహిళలే టార్గెట్‌

ఎఫ్‌సీఐ కాలనీలో ఇద్దరు పాత నేరస్తుల అరెస్ట్‌

2.9 తులాల బంగారం, బైక్‌లు స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: బైక్‌లు దొంగతనం చేసి నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలో నుంచి చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న పాత నేరస్తుడితోపాటు రిసీవర్‌ను  వనస్థలిపురం పోలీసులు, ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు  సోమవారం పట్టుకున్నారు.  క్రైమ్స్‌ డీసీపీ కేఆర్‌ నాగరాజు, ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ అడిషనల్‌ డీసీపీ డి.శ్రీనివాస్‌తో కలిసి సీపీ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్‌ అమీర్‌ ఓ కంపెనీలో గ్లాస్‌ ఫిట్టర్‌గా పని చేసేవాడు. వస్తున్న ఆదాయం చాలక చోరీల బాట పట్టాడు. ఒంటరిగానే వివిధ ప్రాంతాల్లో పార్క్‌ చేసి ఉన్న బైక్‌లను దొంగిలించి సీసీటీవీ కెమెరాలు లేని ప్రాంతాల్లో మాటువేసి  ఒంటరిగా వచ్చే మహిళల మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్లేవాడు.

వాటిని సరూర్‌నగర్‌లోని కనకమహలక్ష్మీ జ్యువెల్లరీ షాప్‌లో పనిచేసే సయ్యద్‌ తౌఫిక్‌కు ఇచ్చి డబ్బులు తీసుకునేవాడు. ఇలా 2014లో చైన్‌ స్నాచింగ్‌ కేసులో చిక్కడపల్లి పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారించగా సైబరాబాద్, హైదరాబాద్‌లో 18 చోరీలు చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. బయటకు వచ్చాక మళ్లీ చైన్‌ స్నాచింగ్‌లు చేస్తూ తుకారాంగేట్‌ పోలీసులకు దొరికాడు. చివరిసారిగా గాంధీనగర్‌ పోలీసులు పట్టుబడగా నాన్‌బెయిలెబుల్‌ వారంట్‌ జారీ చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 11న జైలు నుంచి బయటకు వచ్చిన అమీర్‌ ఎల్‌బీనగర్, వనస్థలిపురంలో ఆరు బైక్‌లు చోరీలు చేయడంతో పాటు మూడు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. వేలిముద్రల ఆధారంగా నిందితుడు అమీర్‌గా గుర్తించిన పోలీసులు అతడి కదలికలపై నిఘా ఉంచారు.ఈ నేపథ్యంలో ఎఫ్‌సీఐ కాలనీలో అతడిని అదుపులోకి విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో చోరీ సొత్తును కొనుగోలు చేసిన రిసీవర్‌ సయ్యద్‌ తౌఫిక్‌ను కూడా అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3లక్షల విలువైన బంగారు ఆభరణాలు, బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా