లండన్‌లో కరోనాకు మందు కనిపెట్టారని..

19 Jun, 2020 10:41 IST|Sakshi

ఔషధంతో పాటు పౌండ్లు పార్సిల్‌ అంటూ ఎర

కస్టమ్స్‌ పేరుతో ఫోన్‌ చేసి రూ.1.3 లక్షలు స్వాహా

సాక్షి, సిటీబ్యూరో: ఫేస్‌బుక్‌ ద్వారా ఫ్రెండ్‌గా పరిచయం కావడం... విదేశీయుల ముసుగులో తమ స్నేహ బంధం పెరగాలంటూ కోరడం... దానికి గుర్తుగా బహుమతులు పంపిస్తున్నానంటూ చెప్పడం... ఆనక విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారుల మాదిరిగా ఫోన్‌ చేసి పన్నుల పేరుతో అందినకాడికి దండుకోవడం.. ఈ తరహాలో సాగే ఫ్రెండ్‌షిప్‌ ఫ్రాడ్స్‌లోకి ఇప్పుడు కరోనా మందులు వచ్చి చేరాయి. లండన్‌కు చెందిన వ్యక్తిగా చెప్పుకున్న సైబర్‌ నేరగాడు నగరానికి చెందిన వ్యాపారి నుంచి రూ.1.3 లక్షలు స్వాహా చేశాడు. బాధితుడు గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నగరంలోని విద్యానగర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి కొన్ని రోజుల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా లండన్‌కు చెందిన ప్యాట్రిక్స్‌ అనే వ్యక్తిగా చెప్పుకున్న సైబర్‌ నేరగాడు పరిచయం అయ్యాడు. కొన్నాళ్లు సజావుగానే చాటింగ్‌ చేసిన ప్యాట్రిక్స్‌ ఆపై అసలు కథ మొదలెట్టాడు. ఇటీవల లండన్‌లో కరోనాకు మందు కనిపెట్టారని, మన స్నేహానికి గుర్తుగా ఆ ఔషధంతో పాటు 60 వేల పౌండ్లు పార్శిల్‌ చేస్తున్నానని చెప్పాడు. ఇది జరిగిన మరుసటి రోజు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారుల పేరుతో వ్యాపారికి కాల్‌ వచ్చింది.

లండన్‌ నుంచి మీ పేరుతో వచ్చిన పార్శిల్‌లో కొన్ని ఔషధాలతో పాటు పౌండ్లు ఉన్నాయని వాటిని క్లియర్‌ చేయడానికి కొన్ని చార్జీలు కట్టాలని చెప్పారు. వారి మాటలు నమ్మిన వ్యాపారి తొలుత రూ.1.3 లక్షలు వారు చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేశారు. అంతటితో ఆగని సైబర్‌ నేరగాళ్లు పౌండ్లను భారత కరెన్సీలోకి మార్చి అందించాల్సి ఉందని, దానికి కన్వర్షన్‌ చార్జీల కింద రూ.1.5 లక్షలు చెల్లించాలని చెప్పడంతో అనుమానం వచ్చిన అతను ఇంటర్‌నెట్‌ నుంచి ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్‌ కార్యాలయం నంబర్‌ తీసుకుని సంప్రదించాడు. దీంతో ఇదంతా మోసమని తేలడంతో సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మరో ఉదంతంలో యాడ్స్‌ యాప్‌ ఓఎల్‌ఎక్స్‌లో పోస్టు చేసి ఉన్న ఫోన్‌ ఖరీదు చేయడానికి ప్రయత్నించిన సంతోష్‌నగర్‌కు చెందిన యువకుడు రూ.66 వేలు. కారు ఖరీదు చేయాలని భావించిన శాలిబండ వ్యక్తి రూ.38 వేలు కోల్పోయారు. నగరానికి మరో వ్యక్తి అమేజాన్‌ ఖాతా నుంచి రూ.46 వేలు విలువైన ఓచర్లు మాయమయ్యాయి. మరో వ్యక్తి ప్రమేయం లేకుండానే అతడి ఖాతా నుంచి రూ.76 వేలు రెండు దఫాల్లో గల్లంతయ్యాయి. వీటిపై బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదయ్యాయి. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు