షార్జీల్‌ ఇమామ్‌పై కేసు.. చార్జిషీట్‌ దాఖలు

18 Apr, 2020 13:38 IST|Sakshi

న్యూఢిల్లీ: రెచ్చగొట్టే ప్రసంగాలతో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో అల్లర్లకు కారణమయ్యారనే ఆరోపణలతో జేఎన్‌యూ పూర్వ విద్యార్థి షార్జీల్‌ ఇమామ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. డిసెంబరు 15న తన విద్వేషపూరిత వ్యాఖ్యలతో విద్యార్థులను రెచ్చగొట్టినందున ఆయనపై చార్జిషీట్‌ వేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబరులో పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు గళమెత్తడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. యూనివర్సిటీకి సమీపంలో ఉన్న న్యూ ఫ్రెండ్స్‌ కాలనీ, జామియా నగర్‌ ప్రాంతాల్లో అలజడి సృష్టించిన అల్లరి మూకలు అనంతరం యూనివర్సిటీలో ప్రవేశించారని పోలీసులు పేర్కొన్నారు. (‘వీడియోతో.. వాళ్లకు వాళ్లుగా దొరికిపోయారు!’)

‘‘రాళ్లు రువ్వుతూ.. ఆయుధాలు చేపట్టి కొంత మంది అల్లర్లకు తెరతీశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను భారీగా ధ్వంసం చేశారు. ఎంతో మంది పోలీసులు, సామాన్య పౌరులకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో డిసెంబరు 13, 2019లో విద్వేషపూరిత ప్రసంగాలు ఇచ్చి అల్లర్లకు కారణమైన షార్జీల్‌ను అరెస్టు చేశాం. మా దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాల ఆధారంగా 124 ఏ ఐపీసీ, 153 ఏ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఈ మేరకు సాకేత్‌ జిల్లా కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశాం’’ అని వెల్లడించారు. కాగా సీఏఏను వ్యతిరేకిస్తూ షాహిన్‌బాగ్‌లో చేపట్టిన నిరసనలో పాల్గొన్న షార్జీల్‌... అలీగడ్‌ ముస్లిం యూనివర్సిటీలో ఇచ్చిన ప్రసంగంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక గతంలోనూ అస్సాం, ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి వేరుచేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు గానూ మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు