Liquor Sale In Delhi: ‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం!

14 Nov, 2023 12:19 IST|Sakshi

ఏటా దీపావళి సీజన్‌లో మద్యం విక్రయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా దేశ రాజధాని ఢిల్లీలో మద్యం విక్రయాలు అత్యధికంగా జరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే దీపావళికి కొద్ది రోజుల ముందు నుంచే మద్యం విక్రయాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. దీపావళి సీజన్‌లో అత్యధిక మద్యం విక్రయాల కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి మొత్తం రూ.525.84 కోట్ల ఆదాయం సమకూరింది.

దీపావళి సందర్భంగా గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు రూ.121 కోట్ల విలువైన 64 లక్షల మద్యం బాటిళ్లను వినియోగదారులు కొనుగోలు చేశారని సమాచారం. అదే సమయంలో దీపావళి పండుగకు వారం రోజుల ముందు కోటికి పైగా మద్యం బాటిళ్లు విక్రయించగా, ప్రభుత్వానికి రూ.234.15 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే దీపావళికి ముందు 17 రోజుల్లో మొత్తం 3 కోట్లకు పైగా మద్యం బాటిళ్లు అమ్ముడుపోవడంతో ప్రభుత్వానికి రూ.525.84 కోట్ల ఆదాయం సమకూరింది.

దీపావళి, హోలీ తదితర పండుగల సమయంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని మద్యం దుకాణాల్లో గురువారం రూ. 17.33 లక్షలు, శుక్రవారం రూ. 18.89 లక్షలు, శనివారం 27.89 లక్షల రూపాయాల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లోనే 64 లక్షలకు పైగా మద్యం బాటిళ్లు అమ్ముడుపోయి, ఢిల్లీ ప్రభుత్వానికి మొత్తం రూ.120.92 కోట్ల ఆదాయం అందింది. అయితే దీపావళి నాడు కొన్ని చోట్ల మద్యం దుకాణాలను మూసివేశారు.

గత ఏడాది కంటే ఈ ఏడాది దీపావళి సందర్భంగా 42 శాతం అధికంగా మద్యం బాటిళ్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది దీపావళికి మూడు రోజుల ముందు వరుసగా 13.46 లక్షలు, 15 లక్షలు, 19.39 లక్షల మద్యం బాటిళ్లు విక్రయించినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి!

మరిన్ని వార్తలు