పొలం వేలం వేస్తారన్న ఆందోళనతో అన్నదాత ఆత్మహత్య

30 Jun, 2019 04:59 IST|Sakshi

ప్రకాశం జిల్లా రాజుపాలెంలో ఘటన

చీరాల మండలంలో ఒకరు, వైఎస్సార్‌ జిల్లాలో మరో రైతు బలవన్మరణం  

మార్టూరు/బల్లికురవ/దువ్వూరు/చీరాల రూరల్‌: గడువులోపు బ్యాంకు రుణం తీర్చకపోవటంతో పొలాన్ని వేలం వేస్తామని అధికారులు నోటీసులు ఇచ్చి.. ఒత్తిడికి గురి చేయటంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా మార్టూరు మండలం రాజుపాలెంలో శనివారం చోటుచేసుకుంది. బల్లికురవ మండలం కె.రాజుపాలెం గ్రామానికి చెందిన శాఖమూరి హనుమంతరావు (40), రాధిక దంపతులు పదేళ్లుగా మార్టూరు మండలం రాజుపాలెం సమీపంలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి కె.రాజుపాలెంలో 1.83 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దానికి తోడు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, పత్తి, జూట్‌ పంటలను సాగు చేస్తున్నాడు. మార్టూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో తన భూమిని తనఖా పెట్టి 2016 జూన్‌ 10న హనుమంతరావు రూ.1.80 లక్షల రుణం తీసుకుని.. 2017 జూన్‌ 14న ఆ అప్పును రెన్యువల్‌ చేయించుకున్నాడు. మధ్యలో రూ.14 వేలు వడ్డీ చెల్లించగా.. రూ.2.40 లక్షలు బకాయిపడ్డాడు. అప్పు తీర్చాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు పంపించగా.. డబ్బు సర్దుబాటు కాకపోవడంతో తీర్చలేకపోయాడు. ఇతడికి రెండు విడతల్లో రూ.41 వేలు మాత్రమే రుణమాఫీ జరిగింది.

ఈ క్రమంలో గతవారం బ్యాంకు అధికారులు హనుమంతరావుకు చెందిన భూమిని జూలై 3న మార్టూరులోని బ్యాంకు ఆవరణలో వేలం వేస్తున్నట్టు పేర్కొంటూ హనుమంతరావు ఇంటి ముందు గల ప్రాథమిక పాఠశాల గోడలకు, కాలనీ ముఖద్వారంలో ఉన్న బస్‌షెల్టర్, మరి కొన్నిచోట్ల నోటీసులు అతికించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం పొలానికి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పిన హనుమంతరావు తన సొంత భూమిలోని వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల పొలాల రైతులు గమనించి భార్య రాధికకు, అధికారులకు సమాచారం అందించారు. హనుమంతరావు గత సంవత్సరం ఇదే భూమిలో మిరప పంట సాగు చేయగా బొబ్బర తెగులు సోకి రూ.లక్ష నష్టం వాటిల్లినట్లు భార్య రాధిక తెలిపింది. మార్టూరు స్టేట్‌బ్యాంకులో వ్యవసాయ రుణం రూ.లక్ష, ముత్తూట్‌ ఫైనాన్స్‌లో బంగారాన్ని కుదువపెట్టి రూ.లక్ష, వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3 లక్షలు కలిపి అప్పు మొత్తం సుమారు రూ.9 లక్షల వరకు ఉన్నట్టు మృతుడి భార్య రాధిక తెలిపింది. ఘటనాస్థలాన్ని బల్లికురవ ఎస్సై పి.అంకమ్మరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అసువులు తీసిన అప్పులు 
అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సుధాకర్‌ కథనం ప్రకారం.. ఈపురుపాలెం పంచాయతీ పరిధిలోని బోయినవారిపాలేనికి చెందిన చిప్పలపల్లి ఆదినారాయణ (30)కు ఐదెకరాల పొలం ఉంది. దాంతోపాటు మరో ఐదెకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో నష్టం రావడం, అప్పులు పేరుకుపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. శనివారం గేదెలను తోలుకుని పొలానికి వెళ్లిన ఆదినారాయణ మద్యంలో పురుగు మందు కలుపుకుని తాగాడు. సాయంత్రం అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గుర్తించిన గ్రామస్తులు భార్య రమకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెళ్లేసరికి మృతి చెందాడు.  

అప్పులు తీర్చే దారిలేక.. 
వ్యవసాయంలో నష్టాలు రావడం, అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో వైఎస్సార్‌ జిల్లా దువ్వూరు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన ఇంజేటి రాముడు (60) ఆత్మహత్య చేసుకున్నాడు. రాముడు తనకున్న రెండెకరాల పొలంతో పాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వరి, పసుపు సాగు చేశాడు. తెగుళ్ల కారణంగా తీవ్రంగా నష్టపోయాడు. కానగూడూరు ఏపీజీబీలో రూ.50 వేలు పంట రుణం పొంది మూడేళ్లు దాటింది. కడప మార్కెట్‌ యార్డులో పసుపు వ్యాపారుల నుంచి రూ.1.50 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.7 లక్షలు, పురుగు మందులు, ఎరువుల వ్యాపారుల వద్ద నుంచి మరో రూ.లక్ష కలిపి మొత్తం రూ.10 లక్షల వరకు అప్పులు పేరుకుపోయాయి. అప్పులిచ్చిన వారి నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో శనివారం తన పొలంలోకి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  

మరిన్ని వార్తలు