కొచ్చి షిప్‌యార్డ్‌లో ప్రమాదం

14 Feb, 2018 02:28 IST|Sakshi

ఐదుగురి మృతి

ఓఎన్‌జీసీ నౌకకు మరమ్మతులు చేస్తుండగా దుర్ఘటన  

కొచ్చి: ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ (ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌)కి చెందిన ఓ నౌకలో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఏడుగురు గాయపడ్డారు. సముద్ర గర్భం నుంచి ముడిచమురును బయటకు తీయడానికి ఉపయోగించే నౌకకు కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో మంగళవారం మరమ్మతులు నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన వారంతా ఒప్పంద కార్మికులేనని భావిస్తున్నట్లు షిప్‌యార్డ్‌ అధికారి ఒకరు చెప్పారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని  తెలిపారు.

‘సాగర్‌ భూషణ్‌’∙నౌకకు మరమ్మతులు నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఓఎన్‌జీసీ ఓ ప్రకటనలో తెలిపింది. మంటల వల్ల వచ్చిన పొగను పీల్చడం వల్లే ఐదుగురు చనిపోయి ఉంటారని భావిస్తున్నామనీ, ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారి చెప్పారు. ప్రమాదంపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా షిప్‌యార్డ్‌ ఎండీని కేంద్ర నౌకాయాన మంత్రి గడ్కరీ ఆదేశించారు. కేరళ  సీఎం విజయన్‌ మృతులకు సంతాపం తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ ప్రకటించింది.

మరిన్ని వార్తలు