మరోసారి విరుచుకుపడ్డ గో రక్షక దళం

15 Oct, 2017 09:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గో రక్షక దళాల పేరిట దేశ రాజధాని శివార్లో శుక్రవారం జరిగిన దాడి దేశవ్యాప్తంగా మరోసారి కలకలం రేపుతోంది. ఫరిదాబాద్‌లో ఓ ఆటో రిక్షాలో బీఫ్ తీసుకెళ్తున్న ఆరోపణతో ఇద్దరిని చితకబాది.. ఆపై వారిని కాపాడేందుకు వచ్చిన మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు.

అజాద్‌ అనే వికలాంగుడు ఓ ఆటో రిక్షా నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం తన ఆటోలో గేదే మాంసంను ఓ దుకాణం వద్దకు తీసుకెళ్తున్నాడు. మార్గమధ్యలో కారులో వచ్చిన ఆరుగురు దుండగులు ఆటోని అడ్డగించారు. అజాద్‌తోపాటు ఆటోలో ఉన్న మరో బాలుడిని తమ వెంట సమీపంలోని బజ్రీ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ గోమాంసం ఆరోపణలతో వారిపై దాడి చేశారు. అది గో మాంసం కాదని ఎంత మొత్తుకున్నా వారిని నిర్దాక్షిణ్యంగా చితకబాదారంట.  విషయాన్ని అజాద్‌ ఫోన్‌లో తన కుటుంబ సభ్యులకు వివరించగా.. అక్కడికి రాగానే వారిపై కూడా దాడికి తెగపడ్డారు. అంతలో మరో 40 మంది వారికి జత కలిశారు.

జై హనుమాన్‌, జై గో మాత చెప్పాలంటూ డిమాండ్ చేశారని.. తాను నిరాకరించటంతో పంది మాంసం తినిపిస్తామని బెదిరించారని గాయపడిన అజాద్‌ మీడియాకు తెలిపాడు. ఏం చేసినా తాను మాత్రం నినాదాలు చేయనని చెప్పటంతో 40 మంది కలిసి తమను దారుణంగా చితకబాదారంటూ... గాయాలు చూపించాడు. అతని మెడ, కాళ్లు, వీపు నిండా దెబ్బలే ఉన్నాయి. కాగా, ముందు బాధితులపై గోమాంసం అక్రమ రవాణా కేసు నమోదు చేసినప్పటికీ.. పరీక్షల్లో అది గేదే మాంసం అని తేలటంతో కేసు కొట్టివేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

గోరక్షక దళాల పేరిట జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన సుప్రీంకోర్టు.. వాటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన విషయం తెలిసిందే. మరో పక్క నిజమైన హిందువులు ఆవులను పూజిస్తారని.. కేవలం నేర చరిత్ర ఉన్న వారే ఇలాంటి దాడులకు తెగబడతారని గోరక్షక దళాలపై ఆరెస్సెస్‌ చీఫ్ మోహన్ భగవత్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు