ఉపాధ్యాయ వృత్తికే కళంకం

2 Aug, 2019 08:11 IST|Sakshi

సాక్షి రామగిరి(పెద్దపల్లి) : లంచాల మకిలి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు అంటుకుంది. ఇప్పటివరకు రెవెన్యూ, ఇరిగేషన్‌ తదితర శాఖలకు పరిమితమైన లంచావతారులు ఇప్పుడు ఉపాధ్యాయుల రూపంలో బయటపడుతున్నారు. తల్లిదండ్రుల తరువాత గురువును దేవునితో పోల్చుతూ ఆచార్యదేవో భవా అంటారు. విద్యార్థులకు సత్యమేవ జయతే, అబద్ధాలు ఆడరాదని చెప్పే ఉపాధ్యాయులే ఇలా అక్రమ సంపాదనకు ఆశపడి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడడం రాష్ట్రవ్యాప్తంగా ఇదే మొదటిసారి కావచ్చు.

నెలకు వేలల్లో వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులే ఇలా అవినీతి కార్యకలాపాలకు పాల్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందరో ఉపాధ్యాయులు నిరుపేద విద్యార్థులకు తమకు తోచినంత సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తూ వృత్తికి వన్నె తెస్తున్న ఈరోజుల్లో ఉపాధ్యాయులంటే అవినీతిపరులే అనే విధంగా చులకన భావం ఏర్పడే విధంగా లంచం తీసుకుంటూ పట్టుబడడం ఆ వృత్తికే మాయని మచ్చగా మారింది.

ఓ ప్రధానోపాధ్యాయురాలు టీసీ కోసం రూ.2 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో గురువారం జరిగింది. మండలంలోని బేగంపేట జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న దండుగుల లలిత విద్యార్థి నుంచి రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఏసీబీ డీఎస్పీ కె.బద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాఠశాలలో సుద్దాల ఓదెలు కుమారుడు రఘు గత విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివాడు. పరీక్షల సమయంలో రఘుకు హాల్‌టికెట్‌ ఇవ్వకుండా హెచ్‌ఎం లలిత ఇబ్బంది పెట్టింది. ఎందుకు హాల్‌టికెట్‌ ఇవ్వడం లేదని రఘు తల్లిదండ్రులు రమ, ఓదెలు హెచ్‌ఎంను కలిసి అడుగగా, రఘు హాజరు శాతం తక్కువగా ఉందని, హాల్‌టికెట్‌ ఇవ్వడం కుదరదని ఖరాకండిగా చెప్పింది. ఆందోళన చెందిన రమ, ఓదెలు ఆమెను బతిమాడారు. అయినా కనికరించలేదు. తన కొడుకు భవిష్యత్‌ నాశనం అవుతుందని రమ హెచ్‌ఎం కాళ్లు మొక్కింది. దీంతో రూ.3 వేలు ఇస్తే హాల్‌టికెట్‌ ఇస్తానని చెప్పింది.

మరోమార్గం లేక కూలీ పనులు చేసుకునే రఘు తల్లిదండ్రులు కొడుకు భవిష్యత్‌ కోసం హెచ్‌ఎం లలితను ప్రాధేయపడి రూ.1,500 చెల్లించడంతో హాల్‌టికెట్‌ ఇచ్చింది. అయితే పదో తరగతి పరీక్షలు రాసిన రఘు భౌతికశాస్త్రంలో ఫెయిల్‌ అయ్యాడు. తర్వాత సప్లిమెంటరీ పరీక్ష రాసి పాస్‌ అయ్యాడు. ఉన్నత చదువుల కోసం టీసీ కావాలని ఇటీవల హెచ్‌ఎంను కలిసి కోరాడు. అందుకు రూ.2 వేలు ఇవ్వాలని లలిత డిమాండ్‌ చేసింది. ఇదే విషయాన్ని రఘు తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు విధిలేని పరిస్థితుల్లో 20 రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

స్పందించిన ఏసీబీ అధికారులు ఓదెలు, రఘు చెప్పే విషయాలను నిర్ధారించుకోవడానికి గతనెల 15న బాధితులతో కలిసి మారువేశంలో పాఠశాలకు వెళ్లారు. లంచం కోసం లలిత బాధితులను వేధిస్తుందని ప్రత్యక్షంగా నిర్ధారణ చేసుకున్నారు. ఆతర్వాత హెచ్‌ఎం మెడికల్‌ లీవ్‌ తీసుకుంది. గురువారం తిరిగి విధుల్లో చేరింది. ఈ క్రమంలో ఓదెలు, రఘు హెచ్‌ఎం లలిత డిమాండ్‌ చేసిన రూ.2 వేలు తీసుకుని పాఠశాలకు వెళ్లారు. డబ్బులు ముట్టజెప్పి టీసీ తీసుకుని బయటకు వచ్చాక.. అక్కడే కాపుకాసిన ఏసీబీ అధికారులు హెచ్‌ఎంను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

లలిత భర్తకు సింగరేణిలో ఉన్నతస్థాయి ఉద్యోగం. వీరు సెంటినరీకాలనీలోని సింగరేణి క్వార్టర్‌లో నివాసం ఉంటున్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పదోన్నతి పొందినట్లు, గతంలో స్కూల్‌ గ్రాంటు, దాతలు విరాళాలు కూడా కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్, వరంగల్, మంచిర్యాలలో ఇతర వ్యాపారాలు కూడా ఉన్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. శుక్రవారం కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ భద్రయ్య వెల్లడించారు.  

మరిన్ని వార్తలు