భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్‌

16 Sep, 2019 07:28 IST|Sakshi

సాక్షి, కమలాపూర్‌: కట్టుకున్న భార్యను నిత్యం అనుమానిస్తూ దారుణంగా హత్య చేసిన కేసులో కమలాపూర్‌ మండలంలోని నేరెళ్లకు చెందిన భర్త పల్నాటి బుచ్చయ్య (72)ను ఆదివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ డి.రవిరాజు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నేరెళ్లకు చెందిన పల్నాటి బుచ్చయ్య–చిలుకమ్మ (65) దంపతులకు ఐదుగురు కూతుర్లు, ఒక కుమారుడు. పెళ్‌లైనప్పటి నుంచి బుచ్చయ్యకు భార్య చిలుకమ్మపై అనుమానం ఉండేది. చివరకు బిడ్డలతో కూడా సరిగా మాట్లాడనిచ్చే వాడు కాదు. చిలుకమ్మ బయటకు వెళ్తే చాలు అనుమానంతో ఆమెను వెంబడించేవాడు.

ఈ క్రమంలోనే ఈ నెల 8న రాత్రి చిలుకమ్మ, బుచ్చయ్య గొడవపడి భోజనం చేయకుండానే పడుకున్నారు. చిలుకమ్మ నిద్రిస్తుండగా బుచ్చయ్య వంటగదిలోని కత్తి తీసుకుని ఆమెను పొడిచి హత్య చేశాడు. ఆమె చనిపోయిందని నిర్దారించుకున్నాక భయంతో తాను కూడా అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయినా తను చావకపోవడంతో తలపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మంటల ధాటికి తాళ్లలేక ఆర్పేసుకున్నాడు. బుచ్చయ్యపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బుచ్చయ్యను ఆయన కుమారుడు డిశ్చార్జ్‌ చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడన్న సమాచరంతో బుచ్చయ్యను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ వివరించారు. కార్యక్రమంలో ఎస్సై సందీప్‌కుమర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు