మాట వినలేదని తల్లీ పిల్లల దారుణ హత్య..!

18 Jan, 2019 09:23 IST|Sakshi
శివరామయ్యతో భార్య వెంకటలక్ష్మమ్మ, కుమారుడు పవన్‌కుమార్‌, కుమార్తె పావని (ఫైల్‌)

భార్య, బిడ్డలకు నిప్పంటించి హత్య

తల్లిదండ్రులతో కలసి ఓ కిరాతకుడు దుశ్చర్య

అక్కడికక్కడే ముగ్గురూ మృతి

కర్నూలు జిల్లాలో దారుణం  

మానవ సంబంధాలు ‘మంట’గలుస్తున్నాయి. అనుబంధాలకు అర్థం లేకుండా పోతోంది. స్వార్థం, వికృత స్వభావం కోరలు చాస్తున్నాయి. దుర్మార్గాలకు ఊతమిస్తున్నాయి. నిండు ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్నాయి. సంబంధ బాంధవ్యాలను ‘బూడిద’ చేస్తున్నాయి. ‘ఆమె’ మాట వినలేదన్న కోపంతో భర్త, అత్తామామ దారుణానికి ఒడిగట్టారు.  ఆమెతో పాటు అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలనూ డీజిల్‌ పోసి తగులబెట్టారు. ఆ ఇల్లాలితో పాటు పసిబిడ్డలు మంటల్లో కాలి బూడిదయ్యారు. ఈ ఘోరం బనగానపల్లె మండలం పండ్లాపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటలక్ష్మమ్మ(35), ఆమె కుమారుడు పవన్‌ కుమార్‌ (12), కుమార్తె పావని(9)లను భర్త శివరామయ్య, అత్తామామ పుట్టా లక్ష్మమ్మ, లక్ష్మన్న కలిసి సజీవ దహనం చేశారు.  

సాక్షి, బనగానపల్లె: గర్భవతి అయిన భార్యను, బిడ్డలను తల్లిదండ్రులతో కలసి కిరాతకంగా చంపేశాడో దుర్మార్గుడు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పండ్లాపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బేతంచెర్ల పట్టణం సంజీవనగర్‌ కాలనీకి చెందిన కొట్టాల బాలసుబ్బమ్మ, గోవిందరాజుల చిన్న కుమార్తె  వెంకటలక్ష్మమ్మ (35)ను 15 ఏళ్ల క్రితం బనగానపల్లె మండలం పండ్లాపురానికి చెందిన పుట్టా లక్ష్మమ్మ, లక్ష్మన్నల  కుమారుడు శివరామయ్యకు ఇచ్చి వివాహం చేశారు. కట్నకానుకల కింద నాలుగు తులాల బంగారం, 40 వేల నగదు ఇచ్చారు. వీరికి కుమారుడు పవన్‌కుమార్‌ (12), కుమార్తె పావని (9) ఉన్నారు.  

వేధించి చంపారు!
పెళ్లయిన కొంత కాలానికే వెంకటలక్ష్మమ్మను ఏదో ఒక కారణాన్ని ఎత్తిచూపి భర్త, అత్త, మామ వేధించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం వెంకటలక్ష్మమ్మ 4 నెలల గర్భిణి కాగా, గర్భం తీయించుకోవాలంటూ భర్త తరచూ వేధించేవాడు. ఆమె అంగీకరించకపోవడంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని పథకం పన్నారు. గురువారం తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉండగా.. వెంకటలక్ష్మమ్మ, కుమారుడు పవన్‌కుమార్, కుమార్తె పావనిపై భర్త శివరామయ్య, అత్తమామలు లక్ష్మమ్మ, లక్ష్మన్న డీజిల్‌ పోసి నిప్పంటించారు. వారి శరీరాలు పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే చనిపోయారు. వెంకటలక్ష్మమ్మ తండ్రి గోవిందరాజులు, సోదరుడు వెంకటాద్రి ఫిర్యాదు మేరకు నందివర్గం ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ, పాణ్యం ఇన్‌చార్జ్‌ సీఐ రవికృష్ణారెడ్డి పరిశీలించారు.  

మరిన్ని వార్తలు