పురోగతిలేని గోలివాడ పనులు

18 Jan, 2019 09:13 IST|Sakshi
మోటార్ల బిగింపు పనులను పరిశీలిస్తున్న స్మితాసబర్వాల్‌ 

పక్షం రోజుల్లోనే రెండోసారి పర్యటన

వానాకాలానికి నీరందడం అనుమానమే

జనవరి 28న డ్రైరన్‌కు రంగం సిద్ధం...? 

సాక్షి, రామగుండం: గోలివాడ పంపుహౌస్‌ పనుల్లో పురో‘గతి’ లోపించడంతో పక్షం రోజుల్లోనే సీఎం పేషీ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ గురువారం రెండోసారి పర్యటించారు. ఈనెల 2న సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, గోలివాడ పంపుహౌస్‌ పనులను సందర్శించారు. ఆ సమయంలో వివిధ ప్రాజెక్టుల్లో అధికారులు పనుల పురోగతిపై ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే అంశంపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రబీకి సాగు నీరందించాలని ముందుగా నిర్ణయించినప్పటికీ మారిన రాజకీయ సమీకరణాలు, అకాల వర్షాలతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో వర్షాకాలానికి సాగు నీరందించాలనే లక్ష్యంతో సీఎం ప్రత్యేక దృష్టి సారించారు.

మార్చి 31లోపు నూరు శాతం పూర్తి కష్టమే... 
సీఎం కేసీఆర్‌ పర్యటన సమయంలో గోలివాడ పంపుహౌస్‌ను సందర్శించిన సమయంలో వారం రోజుల్లో తొలిసారి ఒక మోటార్‌ డ్రైరన్‌ చేస్తామని, ప్రతీ పది రోజులకు ఒకసారి ఒక్కో మోటారు డ్రైరన్‌ చేసి మార్చి 31వ తేదీలోగా నూరుశాతం పంపుహౌస్‌ను వినియోగంలోకి తీసుకువస్తామని అధికారులు సీఎంకు విన్నవించినప్పటికీ పనుల పురోగతిని పరిశీలిస్తే కష్టమేనని తెలుస్తోంది. తాను పర్యటించి పక్షం రోజులైన గోలివాడ పంపుహౌస్‌లో ఒక్క మోటార్‌ కూడా డ్రైరన్‌ చేయకపోవడం పట్ల సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితా సబర్వాల్‌ గోలివాడ పంపుహౌస్‌ను సందర్శించారు. తొమ్మిది మోటార్లలో ఒక మోటారును బిగించగా, మరో మూడు మోటార్లకు సిమెంట్‌ ప్లాట్‌ఫామ్స్‌ సిద్ధం చేయగా, మరో మూడింటికి ఇప్పుడే ఎరక్షన్‌ పనులు కొనసాగుతుండగా, మిగతా రెండు మోటార్ల పనులు ఇంకా ప్రారంభించలేదు. దీనికి తోడు అదనంగా మరో నాలుగు మోటార్లను స్టాండ్‌బైగా బిగింపుకు గోలివాడ పంపుహౌస్‌లో డిజైన్‌ చేశారు. ఎర్త్‌ పనులు నూరు శాతం పూర్తికాగా కాంక్రీట్‌ పనులు 43 వేల క్యూబిక్‌ మీటర్లు పూర్తి చేయాల్సి ఉంది. పంపుహౌస్‌పరిధిలోని 18 లైన్ల పైపులైన్‌ పనులలో 487 పైపులను 17,964 ఆర్‌ఎంటీతో వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 15,044 పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి ఇరవై నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. 

జనవరి 28న డ్రైరన్‌కు కసరత్తు...? 
గోలివాడ పంపుహౌస్‌లో తొమ్మిది మోటార్లలో ఈనెల 28వ తేదీన తొలి మోటార్‌ డ్రై రన్‌ చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరొకటి ఫిబ్రవరి 25న, ఏప్రిల్‌ 10 నాటికి మిగతా ఏడు మోటార్లను వినియోగంలోకి తీసుకురానున్నట్లు పేర్కొంటున్నారు. మోటార్ల డ్రైరన్‌ గడువు పెరుగుతుండడం పట్ల సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్‌ అధికారుల వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టడం లేదని, పనుల పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతోనే పనులలో పురోగతి మందగిస్తుందని, ఇకనుంచి పనులు వేగవంతం చేస్తేనే ఏప్రిల్‌ పది నాటికి పూర్తయి వర్షాకాలం నాటికి సాగునీరందించే అవకాశం అందని సూచించారు. 

మరిన్ని వార్తలు